Bigg Boss Telugu 6 - Faima Jabardasth : అమ్మకు ఇల్లు కట్టించడమే నా లక్ష్యం - ఫైమా 'జబర్దస్త్' నవ్వుల వెనుక విషాదగాథ
'బిగ్ బాస్' హౌస్‌లో అడుగుపెట్టిన ఫైమా గురించి ఆల్రెడీ ప్రేక్షకులకు తెలుసు. టీవీ షో 'జబర్దస్త్' ద్వారా ఆమె ఎంతో మందిని నవ్విస్తున్నారు. అయితే... ఆ నవ్వుల వెనుక విషాద గాథను ఈ రోజు పంచుకున్నారు.
తెలుగు బుల్లితెర వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' ఆరో సీజన్ (Bigg Boss Season 6 Telugu) ఈ రోజు మొదలైంది. ఇప్పటి వరకు హౌస్‌లోకి పదహారు మంది కంటెస్టెంట్లు అడుగు పెట్టారు. ఆ పదహారు మందిలో ఏడుగురు అబ్బాయిలు అయితే... తొమ్మిది మంది అమ్మాయిలు. 'బిగ్ బాస్ 6'లో అబ్బాయిల కంటే అమ్మాయిలు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కదా! ఫిమేల్ డామినేషన్ అనుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే... ఫర్ ద ఫస్ట్ టైమ్, తెలుగు 'బిగ్ బాస్' ఇంటిలోకి ఒక జంటను పంపించారు. వాళ్ళే రోహిత్, మరీనా జంట.
పదహారు మంది తర్వాత 'బిగ్ బాస్' ఇంటిలోకి ఫైమా అడుగు పెట్టారు. ఆమె గురించి ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. బుల్లితెర కామెడీ రియాలిటీ షో 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్' ద్వారా ఎంతో మందిని నవ్విస్తున్నారు. ఇప్పుడు 'బిగ్ బాస్' ఇంటిలోకి 17వ కంటెస్టెంట్‌గా ఫైమా ప్రవేశించారు. ఈ సందర్భంగా తన జీవితం గురించి ఆవిడ చెప్పుకొచ్చారు.
ఫైమా 'జబర్దస్త్' నవ్వుల వెనుక అంతులేని విషాదం ఉందని ఆమె కథ వింటే తెలుస్తోంది. తెలంగాణలోని దూమకొండ అనే చిన్న పల్లెలో ఫైమా జన్మించారు. ఆమె పెద్దగా చదువుకోలేదు. నలుగురు ఆడపిల్లలో ఫైమా ఒకరు. ఎప్పుడూ అమ్మ కష్టపడుతూ ఉండేదని ఫైమా తెలిపారు. తన తండ్రి ఒక వాచ్ మెన్ అని చెప్పారు.
ఫైమా నవ్వుల్లో లెక్కలేనన్ని కన్నీళ్లు, చెప్పలేనన్ని కష్టాలు ఉన్నాయని 'బిగ్ బాస్' ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. అంతే కాదు... మన కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి. ఫైమా తల్లి కూడా ప్రోమోలో మాట్లాడారు. తమ కుటుంబం 35 ఏళ్ళ నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు ఆమె తెలిపారు. తమ ఇంట్లో బాత్ రూమ్ లేకపోవడంతో తన ఆడపిల్లలు చాలా కష్టపడ్డారని ఫైమా తల్లి కన్నీటిపర్యంతం అయ్యారు. తన తల్లికి ఇల్లు కట్టించడమే తన లక్ష్యమని, అందుకే 'బిగ్ బాస్'కు వచ్చానని ఫైమా తెలిపారు.
ఎన్ని కష్టాలు ఉన్నా ఫైమా వెనుకడుగు వేయలేదు. ప్రపంచం అంతా తన వైపు చూసేలా కష్టపడ్డారు. కామెడీతో ప్రజలు అందరూ తమ తమ కష్టాలు మర్చిపోయేలా నవ్వించారు.
నాగార్జునను చూసి ఏడ్చిన ఫైమా
'బిగ్ బాస్' స్టేజి మీదకు వచ్చిన తర్వాత ఫైమా కన్నీళ్లు పెట్టుకున్నారు. 'దేనికి?' అని నాగార్జున అడిగితే... 'మిమ్మల్ని చూసినందుకు' అని తెలిపారు. 'నువ్వు అందరినీ నవ్విస్తావు' అంటూ నాగార్జున ధైర్యం చెప్పారు. మూడేళ్ళ క్రితం తన నవ్వుల ప్రయాణం ప్రారంభమైందని తెలిపారు. తొలి ఏడాది చాలా కష్టపడ్డానని, రెండేళ్ల నుంచి సక్సెస్ స్టార్ట్ అయ్యిందని, అదే తనను ఈ స్టేజి వరకు తీసుకొచ్చిందని తెలిపారు. వెయ్యి శాతం నవ్విస్తానని ప్రామిస్ చేశారు.
రంగు లేదన్నారు... ఎవరు పిలుస్తారని ప్రశ్నించారు!
తాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 'బిగ్ బాస్' గురించి మాట్లాడుతుంటే... ''నిన్ను ఎవరు పిలుస్తారు? నీకు కలర్ లేదు, నీకు పర్సనాలిటీ లేదు' అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఈ స్టేజికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉన్నాను'' అని తెలిపారు.
ప్రవీణ్ నా జీవితంలో చాలా స్పెషల్!'జబర్దస్త్'లో మరో కమెడియన్ ప్రవీణ్ తన జీవితంలో ఎంతో స్పెషల్ అని ఫైమా తెలిపారు. "ప్రవీణ్ తల్లి మరణించిన తర్వాత నన్ను తల్లిలా చూసుకుంటున్నాడు. ఐదు రోజుల క్రితం అతని తండ్రి కూడా మరణించాడు. ఈ సమయంలో నేను అతని పక్కన ఉండాలి. అయితే, నేను ఈ షోకి వెళ్లడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ పంపించాడు'' అని ఫైమా పేర్కొన్నారు.
Also Read : నేను సింగిలే, క్లారిటీ ఇచ్చిన వాసంతి కృష్ణన్ - 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళగానే ముద్దు
ప్రవీణ్‌తో ప్రేమ నిజమే!
ఫైమా 'బిగ్ బాస్'లో అడుగుపెట్టిన సందర్భంగా ప్రవీణ్ సరదాగా రాసిన ప్రేమలేఖ కూడా ఆమె చదివారు. అదీ ప్రవీణ్ వాయిస్ లో వినిపించారు. వంద రోజులు ఫైమా ఫేస్ చూడకుండా ఉండే అవాక్షం లభించిందని, రోజుకొక అమ్మాయితో బయటకు వెళ్లి తిరుగుతూ ఉంటానని ప్రవీణ్ నవ్వించారు. సాధారణంగా 'జబర్దస్త్'లో కొన్ని ప్రేమలు టీఆర్పీ కోసం క్రియేట్ చేస్తున్నారు. ప్రవీణ్, ఫైమాలది అటువంటి ప్రేమకథ కాదని ఈ రోజు క్లారిటీ వచ్చింది.