BellamKonda Ganesh: మోక్షజ్ఞ నటన, డ్యాన్స్‌లతో తాత, తండ్రి పేరు నిలబెడతాడు - బాలయ్య ఫ్యాన్స్‌కు బెల్లంకొండ గణేష్ గుడ్ న్యూస్
బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘నేను స్టూడెంట్ సర్’. త్వరలో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి మోక్షజ్ఞ గురించి గణేష్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు, యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 'స్వాతిముత్యం' అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు గణేష్. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోలేకపోయినా, ఇన్నోసెంట్ యాక్టింగ్ తో బెల్లంకొండ బ్రదర్ అందరి దృష్టిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'నేను స్టూడెంట్ సర్!' అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
సాయి గణేష్, అవంతిక దాసాని జంటగా ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రంలో నటించారు. తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అప్పుడెప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది. జూన్ 2న ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ అయ్యింది. తాజాగా గణేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి మోక్షజ్ఞ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
మోక్షజ్ఞ నేను ‘రచ్చ’ సినిమాకు వెళ్లాం
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ, తాను మంచి ఫ్రెండ్స్ అని గణేష్ చెప్పారు. ఇద్దరు కలిసి సినిమాలు కూడా చూసినట్లు వివరించారు. “బాలయ్య తనయుడు మోక్షజ్ఞ, నేను మంచి మిత్రులం. ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లం. ఓసారి ‘రచ్చ’ సినిమాకు వెళ్లాం. వెనుక నుంచ మమ్మల్ని కొంత మంది ప్రేక్షకులు గుర్తు పట్టారు. ‘రామ్ చరణ్ సినిమాకు బాలకృష్ణ అబ్బాయ్ వచ్చారు రా’ అని ప్రేక్షకులు అరిచారు. ఇద్దరం చాలా చాలా సరదాగా ఫీలయ్యాం” అన్నారు.
త్వరలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుంది
అటు త్వరలోనే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఉండబోతున్నట్లు గణేష్ వెల్లడించారు. “త్వరలోనే ఆయన సినీ ఎంట్రీ ఉంటుంది. ప్రస్తుతం ఫుల్ లెన్త్ ప్రియపరేషన్ లో ఉన్నాడు. వచ్చే ఏడాది లేదంటే, ఆ తర్వాత ఏడాది హీరోగా వచ్చేస్తాడు. మోక్షజ్ఞ మంచి యాక్టర్ అవుతాడు. డాన్స్ కూడా మేమిద్దరం కలిసి చేశాం. ఆయన బాడీలో మంచి నటన ఉంది. ఆడియెన్స్ ను తప్పకుండా మెప్పించ గలుగుతాడు అని నేను భావిస్తున్నాను. ఆయన హైబ్రోస్ కూడా నటిస్తాయి. డైలాగ్ చెప్పేటప్పుడు ఏ కనుబొమ్మను కదపపమంటే ఆ కనుబొమ్మను కదుపుతాడు. ఆయన తప్పకుండా మంచి నటుడు అవుతాడు. తాత, తండ్రి పేరు నిలబెడుతాడు” అని గణేష్ వివరించారు.
సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని తదితరులు ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. SV2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 2న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
Read Also: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్