(Source: ECI/ABP News/ABP Majha)
Arnold Schwarzenegger: రష్యాకు ‘టెర్మినేటర్’ సందేశం, ‘మా నాన్నలా కావద్దు’ అంటూ ఆర్నాల్డ్ భావోద్వేగం
రష్యా ప్రజలకు చిరకాల మిత్రుడైన నేను ఓ నిజం చెప్పాలంటూ టెర్మినేటర్ స్టార్ ఆర్నాల్డ్ పుతిన్, ఆయన సైన్యానికి ఓ సందేశాన్ని పంపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Arnold Message To Russia | హాలీవుడ్ లెజెండ్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్(Arnold Schwarzenegger).. ‘టెర్మినేటర్’ సినిమాతో యావత్ ప్రపంచానికి ఫేవరెట్ స్టార్‌గా నిలిచిన గొప్ప నటుడు. ఈయన మంచి రాజకీయ నాయకుడిగా కూడా పేరొందారు. ఆర్నాల్డ్‌కు రష్యాతో ఎనలేని బంధం ఉంది. అక్కడి ప్రజలకు కూడా ఆర్నాల్డ్ అంటే ఎంతో ఇష్టం. తాజాగా ఉక్రేయిన్-రష్యా మధ్య జరుగుతున్న పోరు ఆర్నాల్డ్‌ను కలచివేసింది. ముఖ్యంగా రష్యా ఉక్రేయిన్ వంటి చిన్న దేశాన్ని, అక్కడి ప్రజలను పొట్టన పెట్టుకోవడం చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన రష్యా ప్రజలు, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)ను ఉద్దేశిస్తూ 9 నిమిషాల వీడియోను ట్వీట్ చేశారు. యుద్ధం వల్ల కలిగే నష్టం, సైనికులు ఎదుర్కొనే మానసిక ఆందోళ గురించి వివరిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. యుద్ధంలో ఓ సైనికుడిగా తన తండ్రి ఎదుర్కొన్న సంఘర్షణ గురించి వివరిస్తూ రష్యా సైనికుల కళ్ల తెరిపించే ప్రయత్నం చేశారు.
‘‘రష్యా(Russia) ప్రజల బలం, వారి మనస్సు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. అందుకే ఉక్రెయిన్‌లో యుద్ధం గురించి, అక్కడ ఏమి జరుగుతుందో మీరు నాకు చెప్పగలరని నేను ఆశిస్తున్నాను. ఎవరూ తమ ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని వినడానికి ఇష్టపడరు. నేను దానిని అర్థం చేసుకోగలను. కానీ రష్యా ప్రజల చిరకాల స్నేహితుడిగా, నేను చెప్పేది మీరు వింటారని ఆశిస్తున్నాను’’ అని ముందుగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఆ తర్వాత ఆయన పుతిన్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘పుతిన్, మీరే ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. మీరే ఈ యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారు. మీరే ఈ యుద్ధాన్ని ఆపగలరు’’ అని అన్నారు. ఈ సందర్భంగా క్రెమ్లిన్(రష్యా అధ్యక్ష భవనం) చేసిన వాదనలను ఆర్నాల్డ్ ఖండించారు. వారు ఉక్రెయిన్ దండయాత్రను ఉక్రెయిన్‌ను డి-నాజిఫై(నాజీ ప్రభావాన్ని తొలగించడం)కే అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు. క్రెమ్లిన్ ఆ దేశంలో బయట వార్తలు, మీడియా, ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా ప్రజలకు కొన్ని విషయాలపై అవగాహన కల్పించాలని భావిస్తున్నానని ఆర్నాల్డ్(Arnold) అన్నారు.
Also Read: ఇది గాయాలను మాన్పుతుందా? ‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు
‘‘రష్యా యుద్ధంతో రెచ్చగొడుతోంది. UN(ఐక్యరాజ్య సమితి) వద్ద 141 దేశాలు రష్యా చర్యలు చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి. యుద్ధంలో రష్యా ఎన్నో పౌర భవనాలపై దాడి చేసింది. వేలాది మంది రష్యా సైనికులు సైతం యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యాలో ఉంటూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నవారంతా ‘నేటి హీరోలు’. ఉక్రెయిన్ దాడికి వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు చేస్తున్న రష్యన్ ప్రజలారా.. ప్రపంచం మీ ధైర్యాన్ని చూసింది. ఈ ధైర్యాన్ని ప్రదర్శించినందుకు మీరు అనుభవించిన బాధలు కూడా మాకు తెలుసు. మిమ్మల్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, కొట్టారు’’ అని తెలిపారు.
Also Read: ‘యుద్ధం’ చూడాలని ఉందా? ఈ 8 వెబ్‌సీరిస్‌లు కట్టిపడేస్తాయ్, డోన్ట్ మిస్!
రష్యా సైనికులను ఉద్దేశిస్తూ ఆర్నాల్డ్ తన తండ్రి యుద్ధంలో ఎదుర్కొన్న భయాన పరిస్థితులను గురించి చెప్పారు. ‘‘నాజీ సైన్యానికి పనిచేసిన నా తండ్రి లెనిన్‌గ్రాడ్‌లో గాయపడ్డారు. నాజీ సైన్యం వల్ల కలిగిన నష్టాన్ని తెలుసుకుని కుమిలిపోయారు. లెనిన్‌గ్రాడ్ వదిలి వెళ్లే సమయానికి ఆయన శారీకరంగా, మానిసికంగా విచ్ఛిన్నమ్యారు. ఆ బాధ ఆయన్ని జీవితాంతం వెంటాడింది. యుద్ధంలో విరిగిన వీపు నొప్పిని భరిస్తూ.. అపరాధ భావంతో కుమిలిపోయారు. ఇది వింటున్న రష్యా సైనికులారా.. నేను చెబుతున్న ఈ మాటల్లో నిజం మీకు ఇప్పటికే తెలుసు. మీరు నా తండ్రిలా విచ్ఛిన్నం కావడం నాకు ఇష్టం లేదు’’ అని ఆర్నాల్డ్ తన సందేశాన్ని ముగించారు. ఇంకా రష్యాతో తనకు అనుబంధాన్ని కూడా వివరించారు. ఈ ‘టెర్మినేటర్’ సందేశం నెటిజనులకు నచ్చేసింది. ఇది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సుమారు 2.87 మంది ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసుకున్నారు. 21 మిలియన్ మందికి పైగా వీక్షించారు.
I love the Russian people. That is why I have to tell you the truth. Please watch and share. pic.twitter.com/6gyVRhgpFV
— Arnold (@Schwarzenegger) March 17, 2022