Guntur Kaaram: అమరావతికి అటు అమ్మ, ఇటు నాన్న- ‘గుంటూరు కారం’ అసలు కథ ఇదేనా?, ఆ టైటిల్ ఎందుకు మార్చారు?
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నా, చివరి నిమిషంలో ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంతకీ, మొదటి నుంచి అనుకున్న టైటిల్ ఏంటంటే?
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీకి ‘గుంటూరు కారం’ అనే పేరును ఖరారు చేశారు. వాస్తవానికి ఈ సినిమా కోసం మొదటి నుంచి చాలా టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. చివరి నిమిషంలో వాటన్నింటినీ వద్దని మేకర్స్ ‘గుంటూరు కారం’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ నుంచి అనుకున్న టైటిల్స్ లో ‘అమరావతికి అటు ఇటుగా’ అనే టైటిల్ ముఖ్యమైనది. ఈ సినిమాలోని కథ కూడా అమరావతి పరిసరాల్లో జరగడంతో ఈ టైటిల్ బాగుంటుంది అనుకున్నారట. చిత్రబృందం కూడా దాదాపు ఇదే టైటిల్ అని ఫిక్స్ అయ్యిందట. టైటిల్ కూడా క్యాచీగా అనిపిస్తుంది అనే అభిప్రాయానికి అందరూ వచ్చారట. ఏం జరిగిందో తెలియదు కానీ, చివరికి ‘గుంటూరు కారం’ అని మార్చారట. మరీ, పత్రికల్లో వచ్చే శీర్షికలా ఉందనే కామెంట్స్ రావడం వల్లే టైటిల్ మార్చినట్లు టాక్.
సినిమా కథ ఇదేనా?
‘అమరావతికి అటూ ఇటూ’ అనే టైటిల్ అనుకోవడం వెనుక ఓ కారణం ఉందట. ఈ సినిమా మొత్తం అమరావతి సమీపంలోనే జరుగుతుందట. ఈ సినిమాలో మహేష్ తల్లిదండ్రులు విడిపోయి అమరావతి పరిసరాల్లో విడివిడిగా ఉంటారట. అందుకే ‘అమరావతికి అటూ ఇటూ’ అనుకున్నారని ఇండస్ట్రీ బజ్. ఈ చిత్రంలో వినోదం, భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. మహేష్ పూర్తిగా ఎనర్జిటిక్, మాస్ పాత్రలో ఇందులో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ తీరుపై మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తి
మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత కూడా త్రివిక్రమ్ పూర్తిగా సినిమాపై దృష్టి పెట్టకుండా ఇతర సినిమా వర్క్స్ కోసం పనిచేస్తున్నాడనే టాక్ రావడంతో మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నారట. మహేష్ సినిమా చేస్తుండగానే అది పక్కన పెట్టి పవన్ కల్యాణ్ ‘బ్రో’ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం పనిచేశారనే విమర్శలు వచ్చాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ సినిమాను ప్రకటించడం కూడా తాజాగా ఫ్యాన్స్ అసహనాన్ని పరీక్షిస్తోంది. ఒక మూవీ సెట్స్ పై ఉండగా మరో మూవీను అనౌన్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారట మహేష్ ఫ్యాన్స్. మరి అనుకున్న విధంగా మూవీ షూటింగ్ ను ఫాస్ట్ గా కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.
త్రివిక్రమ్-మహేష్ కాంబోలో మూడో సినిమా!
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ‘గుంటూరు కారం’ ముచ్చటగా మూడో సినిమా. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. ఇక 'గుంటూరు కారం' విషయానికొస్తే.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల పూజా హెగ్డే ఈ సినిమా నుంచి ఇటీవల హీరోయిన్‌గా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. పూజ హెగ్డే స్థానంలో మహేష్ కి జోడిగా శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని మూవీ టీం సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: భావోద్వేగాల కలబోతతో ‘LGM’ ట్రైలర్ - ధోనీ ఫస్ట్ హిట్ పక్కానా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial