(Source: ECI/ABP News/ABP Majha)
Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. అల్లు అర్జున్‌పై విమర్శలు, ప్రమాదం తర్వాత మొదటి కాల్ బన్నీకే!
సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించకపోగా థియేటర్‌కు వెళ్లి ‘సీటీ మార్’ సినిమా చూడటంపై విమర్శలు వస్తున్నాయి.
రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ కోసం మెగా అభిమానులు ఎంతగా ఆందోళన చెందుతున్నారో తెలిసిందే. తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారికతో సహా దాదాపు అందరూ హాస్పిటల్‌కు వెళ్లి.. తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే, ఆ సమయంలో అల్లు అర్జున్ హైదరాబాద్‌లో లేడు. ‘పుష్ప’ షూటింగ్ నిమిత్తం.. కాకినాడ వెళ్లాడు.
ప్రమాదం జరిగిన తర్వాత రామ్ చరణ్‌తో సహా అంతా సోషల్ మీడియా ద్వారా స్పందించి అభిమానులకు ధైర్యం చెప్పారు. సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందవద్దని చెప్పారు. అయితే, బన్నీ నుంచి ఎలాంటి సందేశం లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ మధ్య చర్చ మొదలైంది. కొందరు బన్నీ మీద విమర్శలు గుప్పిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇందులో బన్నీ తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి బన్నీ సామాజిక మాధ్యమాల్లో స్పందించకపోగా.. కాకినాడలోని ఓ థియేటర్‌లో ‘సిటీమార్’ సినిమా చూసేందుకు వెళ్లడంతో విమర్శలు మరింత పెరిగాయి. హాస్పిటల్‌లో తేజ్ ఆందోళనకర పరిస్థితిలో ఉంటే థియేటర్ వెళ్లి సినిమా చూస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యుడిగా అతడి ఆరోగ్యం గురించి కొంచెమైనా బాధ లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్.. మెగా కుటుంబంతో అంటీ ముట్టన్నట్లు ఉంటున్నాడని, కనీసం ఇలాంటి సమయంలోనైనా వారికి దగ్గరగా ఉండి ఉంటే.. అభిమానులు కూడా సంతోషించేవారని మరికొందరు అంటున్నారు.
Also Read: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ
ప్రమాదం జరిగిన తర్వాత.. మొదట స్పందించింది అల్లు అర్జునేనా?: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్ నుంచి మొదటి కాల్ అల్లు అర్జున్‌కే వచ్చిందని అంటున్నారు. తేజ్‌కు ప్రమాదం జరిగిన తర్వాత మెడికవర్ హాస్పిటల్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ హాస్పిటల్‌లో బన్నీకి తెలిసిన సిబ్బంది ఉన్నారని, వారు స్వయంగా బన్నీకి కాల్ చేసి.. ప్రమాద వార్త చెప్పారని తెలిసింది. దీంతో బన్నీ వెంటనే చిరంజీవితోపాటు తన తండ్రి అల్లు అరవింద్‌ను అప్రమత్తం చేసి.. హాస్పిటల్‌కు పంపారని సమాచారం. తేజ్‌కు ప్రాణాపాయం తప్పిందని, ఆందోళన చెందవద్దని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లలేదని తెలిసింది. బన్నీ ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యుల ద్వారా తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారని అల్లు అర్జున్ సన్నిహితులు చెబుతున్నారు. షూటింగ్ నిమిత్తం బన్నీ కాకినాడలో ఉన్నా.. మనసు మాత్రం సాయి ధరమ్ తేజ్ గురించే కలవరిస్తోందని అంటున్నారు. ఎందుకంటే.. మెగా కుటుంబంలో సాయి ధరమ్ తేజ్ అందరితో కలిసిపోతాడు. బన్నీతో కూడా తేజ్‌కు బాండ్ ఉంది. కాబట్టి.. బన్నీపై వస్తున్న విమర్శలు పట్టించుకోవద్దని మెగా అభిమానుల్లోని ఓ వర్గం అంటున్నారు. ఇలా వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకోవడం తగదంటున్నారు.