Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు
‘ఆదిపురుష్’ టీజర్‌పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులోని సన్నివేశాలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంపీ హోం మంత్రి సైతం దర్శకుడిపై మండిపడ్డారు.
‘ఆదిపురుష్’ మూవీ వివాదాలకు కేంద్రంగా మారింది. ఇటీవల విడుదలైన టీజర్‌ను చూసి ప్రభాస్ అభిమానులే కాదు. దేశమంతా ఆశ్చర్యపోయింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు కార్టూన్ మూవీని తలపించాయి. రాముడి పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. కానీ, రావణుడి అవతారమే మరీ పొంతన లేకుండా ఉందని విమర్శలు వస్తున్నాయి. కొందరైతే రూ.500 కోట్లు పెట్టి కార్టూన్ రామాయణం తీస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే వానర సేనను కూడా అభ్యంతరకరంగా చూపించారని, VFX సీన్స్ మరీ అమీర్‌పేట గ్రాఫిక్స్‌లా ఉన్నాయని అంటున్నారు. ఈ టీజర్‌పై ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి మాళవికా అవినాష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లను దెబ్బతీసేలా ‘ఆదిపురుష్’ మూవీ సీన్స్ ఉన్నాయని తెలిపారు.
తాజాగా మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా సైతం ‘ఆదిపురుష్’ టీజర్ చూసి మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా చిత్రీకరణ ఉందని, అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని కోరుతూ ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓమ్ రౌత్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ‘‘హిందూ మతానికి సంబంధించిన విశ్వాసాలను తప్పుగా చిత్రీకరిస్తూ నిందలు వేయడం సరికాదు. నేను దర్శకుడు ఓమ్ రౌత్‌కు లేఖ రాస్తున్నా. అందులోని అభ్యంతకర సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.
ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు సినిమాలు చూసి నేర్చుకోండి: ఇదివరకు బీజేపీ అధికార ప్రతినిధి, కన్నడ నటి మాళవిక అవినాష్ మాట్లాడుతూ.. ‘‘వాల్మీకి రామాయణం, కంబ రామాయణం లేదా తులసీదాసు రామాయణాలను దర్శకుడు పరిశోధించకుండా వదిలిపెట్టినందుకు బాధగా ఉంది. చివరికి థాయ్‌లాండ్‌లో కూడా రామాయణాన్ని ఎంతో అందంగా ప్రదర్శించారు. కనీసం అతను గతంలో వచ్చిన మన సొంత చిత్రాలను పరిశీలించాలి. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో రావణుడికి ఎలా చూపించారో తెలుసుకోవాలి. రావణుడు ఎలా ఉన్నాడో అర్థం చేసుకోవడానికి దర్శకుడు ‘భూకైలాస్’లో ఎన్‌టి రామారావు లేదా డాక్టర్ రాజ్‌కుమార్‌లను చూసైనా తెలుసుకోవాలి. ‘సంపూర్ణ రామాయణం’లో ఎస్‌వి రంగారావును చూసి ఉండవచ్చు. నీలి కళ్లు, లెదర్ జాకెట్లు ధరించేవారు భారతీయులు కాదు. ‘రామాయణం’ అంటే మన దేశ గొప్పతనాన్ని తెలిపే చరిత్ర. సృజనాత్మక స్వేచ్ఛ ముసుగులో ఇలా చేయడం తగదు’’ అని తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో #BoycottAdipurush హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరి, చిత్ర యూనిట్ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
హాలీవుడ్ లో 'ఆదిపురుష్': ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Also Read : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్