Parineeti Chopra-Raghav Chadha Wedding: రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా పెళ్లి ముహూర్తం ఫిక్స్ - ఏడు అడుగులు వేసేది ఎక్కడంటే?
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఉదయపూర్ వేదికగా వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెలలోనే రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో లీలా ప్యాలెస్ తో పాటు ది ఒబెరాయ్ ఉదయవిలాస్‌లో వివాహ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. 200 మందికి పైగా అతిథులు ఈ వివాహ వేడుకలో పాల్గొననున్నారు. వీరు బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 50 మందికి పైగా వివిఐపి అతిథులు కూడా వివాహ వేడుకకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు హోటళ్లలో వివాహ వేడుకకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పంజాబ్ కౌంటర్ భగవంత్ మాన్ సహా పలువురు హాజరుకానున్నారు. పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా రానున్నారు.
సెప్టెంబర్ 23న పెళ్లి వేడుకలు ప్రారంభం
తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 23న హల్దీ, మెహందీ, సంగీత్ తో వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పెళ్లి తర్వాత, హర్యానాలోని గురుగ్రామ్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. లీలా ప్యాలెస్, ఉదయవిలాస్‌తో పాటు సమీపంలోని మూడు హోటళ్లను కూడా పరిణీతి, రాఘవ్ కుటుంబ సభ్యులు బుక్ చేశారు. వీవీఐపీ అతిథులు వచ్చే అవకాశం ఉండటంతో ఇంటెలిజెన్స్ అధికారులు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఉదయపూర్‌కు వెళ్లి హోటళ్లను చూశారు. అన్నీ ఓకే అనుకున్నాకే బుక్ చేశారు.
మే 13న ఢిల్లీలో ఘనంగా నిశ్చితార్థం
మే 13న ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా ఎంగేజ్‌మెంట్ కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బంధుమిత్రుల ఆశీర్వాదాల నడుమ ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ వేడుకలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రముఖనటి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు.
View this post on Instagram
కలిసి చదువుకునే రోజుల్లోనే ప్రేమాయణం
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కలిసి చదువుకున్నారు. వారికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీరి ద్వారా పరిచయం పెరిగింది. అదికాస్తా ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఈ విషయం బయటకు తెలిసింది. వీరిద్దరూ కలిసి ఓ హోటల్‌కు డిన్నర్ డేట్‌కు వెళ్లారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం ప్రచారం జరిగింది. చివరకు వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.
Read Also: ‘స్కంద‘ వాయిదా - 'సలార్' విడుదల తేదీకి వెళ్లిన బోయపాటి, రామ్ సినిమా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial