Karnataka Elections BJP : " ఆ ఒక్క కారణం"తో కర్ణాటక తెలుగు ఓటర్ల మద్దతు - బీజేపీ నమ్మకం !
కర్ణాటక తెలుగు ఓటర్లు బీజేపీకి మద్దతివ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. కర్ణాటకలో తెలుగు ప్రజల విద్య, వ్యాపార, ఉద్యోగవకాశాలకు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు.
Karnataka Elections BJP : కర్ణాటకలో విద్య, వ్యాపారం, ఉద్యోగాల నిమిత్తం ఉంటున్న తెలుగు ప్రజలు ప్రశాంతంగా.. ఎప్పట్లా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీకే మద్దతివ్వాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడ్డారన్నారు. బీజేపీ హయాంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని.. ఇక ముందు కూడా రావని భరోసా ఇచ్చారు. ఈ కారణంగా కర్ణాటకలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పదో తేదీన జరగనున్నాయి.
రేపు జరిగే కర్నాటక ఎన్నికల్లో ఈ ఓక్క కారణంతో బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని తెలుగు మాట్లాడే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూన్నాను!#BJPWinningKarnataka #Telugu pic.twitter.com/I7EpcWlgD4
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 9, 2023
కర్ణాటకలో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల నేతలు కర్ణాటకలో విస్తృత ప్రచారం చేశారు. ఉత్తర కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్, హోసూర్, కోలార్, బీదర్, గంగావతి, రాయచూర్, కొప్పోల్, గుల్బర్గా, వంటి చాలా ప్రాంతాల్లో తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. అక్కడ చాలా మంది కన్నడ వారు కూడా తెలుగు మాట్లాడగలరు. అందువల్ల సరిహద్దు ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల నేతలు ప్రచారానికి వెళ్తున్నారు. రెండు రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. అందుకే కీలక నేతలంతా అక్కడే మకాం వేశారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ప్రచారం ప్రారంభమయినప్పటి నుండి అక్కడే ఉన్నారు. ప్రధాని మోదీ పర్యటనల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు.
సోము వీర్రాజు సహా పలువురు నేతలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరుకున్నప్పటికీ కోలుకున్న వెంటనే కిషన్ రెడ్డి కూడా ప్రచారంలోకి వచ్చారు. తెలుగు కమ్యూనిటీతో సమావేశాలు నిర్వహించారు.బీజేపీ తరపున బ్రహ్మానందం చిక్ బళ్లాపూర్‌లో ప్రచారం చేశారు. చిక్కబళ్లాపుర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ కు మద్దతుగా ప్రచారం చేశారు. సుధాకర్ ఎంతో మంచివాడని.. ఆయన చేసిన మంచి పనులను గుర్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. వ్యక్తిగత సంబంధాలు ఉన్న బీజేపీ నేతల కోసం.. పలువురు ప్రముఖులు కూడా కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు.
కన్నడ స్టార్లకు తెలుగులోనూ గుర్తింపు ఉంది. కిచ్చా సుదీప్, దర్శన్ వంటి వారు కూడా తెలుగు ఓటర్లకు తెలుగులో విజ్ఞప్తి చేశారు. బీజేపీని గెలిపించాలని కోరారు. తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విష్ణువర్దన్ రెడ్డి విస్తృతంగా పర్యటించి.. సమన్వయకర్తలా వ్యవహరించారు. బీజేపీ నేతలు.. తెలుగు వారికి ఎలాంటి అవసరం వచ్చినా ముందుంటారని భరోసా ఇచ్చారు. కర్ణాటకలో ఏపీ ప్రజల విద్య, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు భద్రంగా ఉండాలంటే బీజేపీ కి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.