TS Assembly Elections 2023: కాసేపట్లో బీఆర్‌ఎస్ ఫస్ట్ లిస్ట్- సిట్టింగ్‌లతోపాటు కొత్తవారికి ఛాన్స్
గతంలో అసెంబ్లీని రద్దు చేసిన రోజునే అభ్యర్థుల్ని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈసారి కూడా ముందే జాబితా విడుదల చేస్తున్నారు.
TS Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైపోయింది. ఇప్పుడు అది మరింత హీటెక్కించే దశకు చేరుతోంది. దీనికి ముఖ్యంత్రి, బీఆర్‌ఎస్ అధినేత శ్రీకారం చుట్టబోతున్నారు. నోటిపికేషన్ రాక ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ చేయనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ పైనల్ అయిపోయింది. చాలా రోజులుగా ఇదిగో జాబితా అదిగో జాబితా అని ఊరిస్తూ వచ్చారు. ఇవాళ మంచి ముహూర్తం ఉందని అందుకే తొలి జాబితాను కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. శ్రావణమాసంలో శుక్రవారం రోజున ఎన్నికలకు తొలి అడుగ్గా మొదటి జాబితాను ప్రకటించాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో వాయిదా పడింది. ఈసారి మాత్రం కచ్చితంగా ప్రకటన ఉంటుందని అంటున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు.
గతంలో అసెంబ్లీని రద్దు చేసిన రోజునే అభ్యర్థుల్ని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. తొలి జాబితాను విడుదల చేయడంలో కేసీఆర్ లక్కీ నెంబర్‌గా ఉండే 6కు తగ్గట్లుగా ఉంటుందని చెబుతున్నారు. అందులో భాగంగానే తొలి జాబితాలో అభ్యర్థుల సంఖ్య 66 లేదా 87 లేదా 96 లేదా 105 చొప్పున ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే ఏయే నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది దాదాపుగా కొలిక్కి వచ్చింది. వివాదం లేని స్థానాలన్నీ ఫస్ట్ లిస్టులో చోటుచేసుకుంటాయి. పనిలో పనిగా ఓ జాబితా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఫస్ట్ లిస్ట్‌లో సీఎం కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసే స్థానాలు ఉన్నాయి. చాలా వరకు సిట్టింగులకు అవకాశం కల్పించగా..కొన్ని చోట్ల కొత్త వారికి కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు మొత్తం 78 మంది అభ్యర్థుల పేర్లతో ఉన్న లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అదంతా ఫేక్ అని అసలు ఎన్ని సీట్లలో అభ్యర్థుల్ని ఖరారు చేస్తారో తెలియదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవాళ మొదటి జాబితాను విడుదల చేయనున్న బీఆర్‌ఎస్ నాలుగు రోజుల వ్యవధిలోనే రెండో జాబితాను కూడా విడుదల చేస్తారని టాక్ నడుస్తోంది. ఇలా వెంట వెంటనే అభ్యర్థుల జాబితాను ప్రకటించి వాళ్లంతా వీలైనంత ఎక్కువ సమయం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీని వల్ల విపక్షాలకి కూడా ఎక్కువ టైం ఉండదని భావిస్తున్నారు.