AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో అనుకున్నట్టుగానే పల్నాడు సహా పలు ప్రాంతాల్లో పోలింగ్ హింసాత్మకంగా మారింది. పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్, దొంగ ఓట్లు కలకలం రేపుతున్నాయి.
Andhra Pradesh Election Polling Updates: అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు కొట్టుకున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. దాచేపల్లిలోని కేసనపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకు వెళ్లే విషయంలో వైసిపి టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో టిడిపి, వైసీపీ నేతలు గాయపడ్డారు.
రెంటచింతలలో టీడీపీ, వైసీపీ ఘర్షణ
రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ వివాదంలో ముగ్గురు టీడీపీ ఏజెంట్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది.
పల్నాడు జిల్లా రెంటచింతలలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. దీనిపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే అదనపు బలగాలు తరలించాలని ఆదేశించింది.
కడప జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కమలాపురం కోగట్టంలోనూ ఇరు పార్టీల ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మైదుకూరులో టీడీపీ పోలింగ్ ఏజెంట్‌ను వైసీపీ నేతలు చితక్కొటారు.
అన్నమయ్య జిల్లా, కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం, పాపక్క గారి పల్లెలో టిడిపి ఏజెంట్లపైన వైసిపి నాయకులు దాడి చేశారు. ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామ ప్రజలు తెలిపారు. సుభాష్ రెడ్డి అనే నాయకుడిని ఊరి బయట కొట్టి పడేశారు. సుమారు నాలుగు గంటల తర్వాత అతని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలతో చేరుకున్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద డిఎస్పి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, ఓటింగ్ ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు.
జగన్మాత చర్చి వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. వాళ్లంతా వైసీపీ తరఫున ఓటు వేసేందుకు వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐదుగుర్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
పోలింగ్ ఏజెంట్‌ను కిడ్నాప్ కలకలం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బూరుగుమందలో 188,189,190 పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్లను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఉదయం పోలింగ్ కేంద్రాలకు వస్తున్న వారిని అటకాయించి కొట్టి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు దీనిపై జిల్లా కలెక్టర్‌కు నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు, ఏజెంట్ లు పీలేరులో లభ్యమైనట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రకటన విడుదల చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అన్ని పార్టీల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించినట్లు వెల్లడించారు. దీనిపై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి పనులకు తెగబడుతున్నారని ఆరోపించారు.