Telangana CM News: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా? భట్టి విక్రమార్కా? ఖర్గే నివాసంలో కాంగ్రెస్ పెద్దల మంతనాలు
Telangana News: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డా లేదంటే మల్లు భట్టి విక్రమార్కా అన్న దానిపై సందిగ్దత కొనసాగుతోంది.
Telangana Assembly Elections : తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) ఎవరన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డా (Revanth Reddy )లేదంటే కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కా( Mallu Bhatti Vikramarka ) అన్న దానిపై సందిగ్దత కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని...ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ వంటి నేతలు బలపర్చారు. ఏక వ్యాఖ్య తీర్మానానికి హైకమాండ్ పంపారు. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి మధ్యాహ్నం...ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమావేశం కానున్నారు. తెలంగాణ పరిణామాలపై చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో ఠాక్రే, డీకే శివకుమార్ చర్చలు జరుపుతున్నారు. సుదీర్ఘంగా ఈ చర్చలు సాగుతున్నాయి. అనంతరం వీళ్లంతా కలిసి ఖర్గే నివాసానికి చేరుకుంటారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎంపై చర్చలు జరుపుతున్నారు. కాసేపట్లో అంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయానికి వస్తారు. అనంతరం ఓ పేరు ఖరారు చేయనున్నారు. తర్వాత ఆ పేరును సోనియా గాంధీకి తెలియజేస్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రిని నిర్ణయించడం కోసం సోమవారమే కీలక నేతలంతా ఢిల్లీ వెళ్లారు. డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నేతలు హస్తినలోనే ఉన్నారు. సోమవారం సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. రాత్రికి ప్రమాణస్వీకారం ఉంటుందని తొలుత ప్రచారం జరిగినా.. సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో అది వాయిదా పడింది. ఖర్గేతో డీకే శివకుమార్, ఠాక్రే భేటీ అనంతరం దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
మెజార్టీ సభ్యులు రేవంత్ రెడ్డి వైపే
మెజార్టీ శాసనసభ్యులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పేర్లు చర్చకు వచ్చినప్పటికీ... ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో దూకుడుగా వెళ్లగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతం. ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డికి మంచి పేరు ఉంది. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి ఒక్కడే రాష్ట్రం మొత్తం తిరిగారు. పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను భూజాన వేసుకున్నారు. జీరోకి పడిపోయిన కాంగ్రెస్ పార్టీని రేసులోకి తీసుకురావడంతో..గెలిపించడంలో రేవంత్ రెడ్డిదే కీలక పాత్ర. ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడటం...కేసీఆర్ స్థాయిలోనే ప్రజల్లో ఛరిష్మా ఉండటం రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలు. అధిష్థానంలోని పలువురు నేతలు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తే మంచిందన్న అభిప్రాయం వెల్లడించినట్లు తెలుస్తోంది.
భట్టి విక్రమార్క దూకుడుగా వ్యవహరించలేరా ?
మరోవైపు భట్టి విక్రమార్క...ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ అనేక ప్రతికూలాంశాలు ఉన్నాయి. అధిష్టానానికి నమ్మిన బంటు అయినప్పటికీ...భట్టి విక్రమార్క దూకుడుగా వ్యవహరించలేరన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షంలోని గులాబీ బాస్ కేసీఆర్, హరీశ్ రావు, కల్లకుంట్ల తారక రామారావు ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పికొట్టలేరన్న ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల పాటు సీఎల్పీ నేతగా వ్యవహరించినప్పటికీ...ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార పార్టీ నేతలకు సరైనస్థాయిలో కౌంటర్లు ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. భట్టి విక్రమార్క...దూకుడుగా వ్యవహరించకపోవడం, పాతతరం కాంగ్రెస్ నేతల్లా వ్యవహరించడం వంటివి మైనస్ అయ్యే అవకాశం ఉంది.