బీజేపీ నాయకత్వంలో పని చేస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ - ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్‌పై బీజేపీ ఒత్తిడి చేస్తోందన్నారు కేటీఆర్. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తు తిరిగి పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.
మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ రాజకీయ రంగు పులుముకుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన తీరును తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పు పట్టారు. ఈసీ తీరు తీవ్ర ఆక్షేపనీయమన్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ భారతీయ జనతాపార్టీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇదో మరో ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు.
పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్‌పైనా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేటీఆర్. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనన్నారు. గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్ తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమన్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ @KTRTRS.
— TRS Party (@trspartyonline) October 20, 2022
భారతీయ జనతా పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కాణమన్నారు
1/n
- File Photo pic.twitter.com/4O8UbUdjje
తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నానికి బిజెపి తెరతీసిందన్నారు కేటీఆర్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్‌ను బదిలీ చేయడాన్ని ఖండించారు. బీజేపీ జాతీయ నాయకత్వంలో పని చేస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఓటమి తప్పదు అనే బిజెపి అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు