Telangana Lok Sabha Elections 2024: తెలంగాణలో ముగిసిన పోలింగ్ - ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ
Telangana Lok Sabha Election 2024 Voting Live Updates: తెలంగాణలో లోక్ సభ సమరానికి సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
LIVE
Background
Telangana Lok Sabha Election 2024 Phase 4 polling Live: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. 17 లోక్ సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభం అవుతుంది. అనంతరం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ సాగనుంది. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తారు.
రాష్ట్రంలో 17 స్థానాల్లో మొత్తం 625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 3.31 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ భద్రత కోసం 73 వేల మందికి పైగా పోలీస్ బలగాలను మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఫోర్సెస్ తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 7 వేల మంది ఇతర రాష్టాల హోంగార్డులతోనూ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
అక్కడ సాయంత్రం 4 వరకే పోలింగ్
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంటారు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ లో హైఅలర్ట్ ప్రకటించారు. పోలింగ్ కు 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని.. సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని.. ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు.
ఇదీ ముఖచిత్రం
- తెలంగాణలో మొత్తం ఓటర్లు - 3,32,32,318
- పురుష ఓటర్లు - 1,65,28,366
- మహిళా ఓటర్లు - 1,67,01,192
- ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది - 2,94,000
- భద్రతా విధుల్లో 160 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 73 వేల మందికి పైగా రాష్ట్ర పోలీసులు
- మొత్తం బ్యాలెట్ యూనిట్స్ - 1,05,019
బరిలో ప్రముఖులు
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (కరీంనగర్), మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), కాంగ్రెస్ నేత దానం నాగేందర్ (సికింద్రాబాద్), ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి (చేవెళ్ల), మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (నాగర్ కర్నూల్), నామా నాగేశ్వరరావు (ఖమ్మం) వంటి ప్రముఖులు బరిలో నిలిచారు.
తెలంగాణలో ముగిసిన పోలింగ్ - ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతిస్తున్నారు.
కంటోన్మెంట్ లో 47.88 శాతం - హైదరాబాద్ లో 39 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం ఓటింగ్ నమోదు కాగా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో సాయంత్రం 5 గంటల వరకూ 47.88 శాతం నమోదైంది. హైదరాబాద్ లో 39 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సాయంత్రం 5 గంటల వరకూ 53.15 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది.
కార్యకర్తలపై ఎస్సై దాడి - చర్యలు తీసుకోవాలని ఆందోళన
కామారెడ్డి జిల్లా దోమకొండ ముత్యంపేటలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై నిలబడ్డ తమపై ఎస్సై దాడి చేశారని.. నిరసిస్తూ పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటు వేస్తూ సెల్ఫీ - ఓటరుపై కేసు నమోదు
జగిత్యాల జిల్లాలో ఓ ఓటరు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో జయరాజ్ అనే వ్యక్తి ఓటు వేస్తూ సెల్ఫీ తీశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సదరు ఓటరుపై కేసు నమోదు చేశారు.
తెలంగాణలో చివరి దశకు పోలింగ్ - సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం ఓటింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుండగా.. ఓటింగ్ చివరి దశకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది.