Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Telangana Polling News: ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకూ సాగింది. 13 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ ను గంట ముందు సాయంత్రం 4 గంటలకే ముగించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 70.60 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 5 గంటలలోపు క్యూలో నిలబడి ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. నేడు (నవంబరు 30) రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకూ సాగింది. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ ను గంట ముందు సాయంత్రం 4 గంటలకే ముగించారు.
ఈ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగింపు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కేవలం 13 ప్రాంతాల వారికి మాత్రం సాయంత్రం 4 గంటల వరకే ఓటు వేసే అవకాశం ఉంటుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రకారం.. ఈ ప్రాంతాల్లో మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 4 గంటలలోపు క్యూలో ఉన్నవారిని ఓటు వేయడానికి అధికారులు అనుమతిస్తున్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి స్పెషల్ లీవ్: వికాస్ రాజ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 29, 30 తేదీలలో పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక సెలవు ప్రకటించారు. స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని వికాస్ రాజ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ABP CVoter Telangana Exit Poll 2023 : తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో .. కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కానీ.. అదే సమయంలో హంగ్ అసెంబ్లీ అంచనాలను కూడా తోసిపుచ్చలేమని ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తేలింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితికి 38 నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమికి మూడు నుంచి 13 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇతరులు 5 నుంచి 9 స్తానాల్లో గెలుస్తారు. ఇతరుల్లో మజ్లిస్ పార్టీ కూడా ఉంది.