BRS, Congress complaints: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ ఫిర్యాదులు-తెలంగాణ సీఈవో రియాక్షన్ ఏంటంటే?
తెలంగాణ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. నిన్న సీఈవోను కలిసి కంప్లెయింట్లు ఇచ్చారు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బృందాలు.
BRS Congress Complaints To CEO Vikas Raj: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్(Congress) మధ్య పోటాపోటీ కొనసాగుతోంది. నువ్వా నేనా అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు... ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పరస్పర ఫిర్యాదులతో తెలంగాణ ఎన్నికల సంఘం (Election Commission of Telangana) తల బొప్పికడుతోంది. నిన్న... తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి వెళ్లిన ఇరు పార్టీలు.. ఒకరిపై మరొకరు పోటాపోటీగా కంప్లెయింట్స్ చేశారు.
ముందుగా... తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ కలిసింది. కాంగ్రెస్ ఇస్తున్న ఎన్నికల ప్రచార ప్రకటనలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఫిర్యాదు చేసింది. బీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా వస్తున్న కాంగ్రెస్ ప్రకటనలను వెంటనే ఆపించాలని కోరింది. అలాగే... తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రసంగాలపై కూడా ఫిర్యాదు చేసింది బీఆర్‌ఎస్ లీగల్ టీమ్. రేవంత్‌రెడ్డి ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని.. ఆయన్ను ప్రచారం నుంచి తొలగించాలని ఫిర్యాదు చేసింది.
సీఈవోకు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ ప్రతినిధి సోమాభరత్... ఆ వివరాలను వెల్లడించారు. తెలంగాణలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని... దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని సీఈవోకు ఫిర్యాదు ఇచ్చినట్టు చెప్పారాయన. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి క్యాడర్‌ను రెచ్చగొట్టేలా... హింస చెలరేగేలా ప్రసంగిస్తున్నారని సీఈవోకు ఫిర్యాదు చేశామన్నారు సోమాభరత్. దుబ్బాక, అచ్చంపేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థులపై జరిగిన దాడులను కూడా సీఈవోకు వివరించామన్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులపై దాడులు చేస్తూ.. గొడవలు సృష్టిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతేకాదు... బీఆర్‌ఎస్ అభ్యర్థులపై జరుగుతున్న దాడులపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హేళనగా మాట్లాడుతున్నారని... ఆరోపించారు. పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో గొడవలు సృష్టించాలని చూస్తున్నారని తెలంగాణ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది బీఆర్‌ఎస్ లీగల్ టీమ్. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రకటలపై కూడా బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు శృతి మించాయని.. సీఎం కేసీఆర్ అవమానించేలా, ఆయన ప్రతిష్ట దిగజార్చేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంసీఎంసీ (Media certification Monitoring committee) కమిటీకి కాంగ్రెస్ వాళ్లు చూపించిన ప్రకటనలు ఒకటి అయితే... బయట ప్రచారం చేస్తున్న ప్రకటనలు మాత్రం మరోలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఆ ప్రకటనలు వెంటనే ఆపించాలని కోరారు. దీంతో ఆ యాడ్స్ ఆపాలంటూ కాంగ్రెస్‌కు సీఈవో నుంచి నోటీసులు వెళ్లినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి బీఆర్‌ఎస్‌పై ఫిర్యాదు చేశారు. అలంపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయుడి అఫిడవిట్‌లో అవకతవకలు ఉన్నాయని తెలిపారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారా లేదా అన్న విషయంలో స్పష్టత లేదని కాంగ్రెస్ అంటోంది. కనుక.. విజయుడిని పోటీ నుంచి తప్పించాలని ఈసీని కోరారు కాంగ్రెస్ నేతలు. దీంతోపాటు ప్రచార ప్రకటనలపై బీఆర్‌ఎస్ చేసిన ఫిర్యాదుపైనా కూడా క్లారిటీ ఇచ్చారు. నాలుగు ప్రకటనలు ఆపేయాలని తెలంగాణ సీఈవో ఆఫీసు నుంచి తమకు నోటీసులు వచ్చాయని చెప్పారు. అయితే.. ఆ యాడ్స్‌ను ఎంసీఎం అనుమతి తీసుకున్నాకే ప్రచారం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అరాచకాలు ఎక్కువై పోయాయని... తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలను బీఆర్‌ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీనిపై కూడా తెలంగాణ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.