Telangana Elections: డబ్బులు పంచకుండా మోసం! మేం ఓటేసేది లేదు, తేల్చి చెప్పిన ఓటర్లు!
Telangana Polling 2023 News: గత రెండు అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా తెలంగాణలో గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.
Telangana Assembly Elections 2023: హైదరాబాద్: గత రెండు అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా తెలంగాణలో గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 3 గంటల వరకూ 51.89 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం నమోదైనట్లు చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ ముగియగా, మరికాసేపట్లో 106 చోట్ల ఓటింగ్ ముగియనుంది.
కొన్నిచోట్ల విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. తమ చుట్టుపక్కల వారికి డబ్బులు పంచి, తమకు ఏం ఇవ్వకుండా మోసం చేశారంటూ ఓటర్లు రోడ్డెక్కతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో లో అయితే కొందరు మహిళలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఏం జరిగిందని అడిగితే.. పట్టణంలో పలు వార్డుల్లో నగదు పంచారు, కానీ తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ధర్నాకు దిగారు. అభ్యర్థి నుంచి కౌన్సిలర్లు తీసుకున్న నగదు తమకు ఇవ్వకుండా వానే స్వాహా చేశారని ఆరోపించారు.
వైరా నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో అక్కడక్కడా ఎన్నికలను బహిష్కరించారు. ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో రోడ్డు, తాగునీటి సౌకర్యంతో సహా మౌలిక వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఓటు వేయాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. తమకు నేతలపై నమ్మకం పోయిందన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేటలోనూ పోలింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, తాము ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు గిరిజనులు. అయితే తమకు ఎవరూ అభివృద్ధి చేయకపోతే నోటాకు ఓటు వేసే ఛాన్స్ ఉందని అధికారులు చెప్పినా వారు వినలేదు.
గ్రామ పంచాయతీ చేయలేదని ఆగ్రహం!
కొన్నిచోట్ల డబ్బులు పంచలేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలింగ్ ను బహిష్కరించారు. అయితే ఇందుకు భిన్నంగా బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలంలోని వరిపేట గ్రామస్తులు ఓటింగ్ కు దూరమయ్యారు. తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా చేయలేదని నిరసనగా ఎన్నికలకు దూరంగా ఉండటంతో అధికారులు రంగంలోకి దిగి వారితో చర్చలు జరుపుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కొత్తపల్లిలో తమకు రోడ్డు సౌకర్యం కల్పించలేదని నిరసనగా గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమకు సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. మరోవైపు మహబూబాబాద్ లో ఓటర్లు నగదు డిమాండ్ చేశారు. బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామపంచాయతీ పరిధిలోని సంతులాల్ పోడు ఎస్సీ కాలనీ ఓటర్లు తమకు డబ్బులు పంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు పంచితేనే ఓట్లు వేస్తామని తేల్చి చెప్పడంతో అధికారులు షాకయ్యారు.
ఆ 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్ - క్యూలో ఉన్న వారికే ఓటేసే ఛాన్స్
రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లోని మొత్తం 600 కేంద్రాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, భద్రాచలం, సిర్పూర్ టీ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, ములుగులో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే, క్యూలో ఉన్న వారిని ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply