Kamal Haasan: వెనక్కి తగ్గని కమల్... కన్నడలో 'థగ్ లైఫ్' కిరికిరి - కోర్టుకు వెళ్లిన నిర్మాతలు.. అసలేం జరిగిందంటే?
Thug Life: కన్నడ భాషపై కమల్ హాసన్ రీసెంట్ కామెంట్స్ పెను దుమారాన్నే రేపాయి. అసలు ఈ వివాదం వెనుక అసలు కారణం ఏంటీ.. ఎందుకు కన్నడీగులు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ఓసారి చూస్తే..

Kamal Haasan Language Comments Controversy Affected To Thug Life: కన్నడ భాషపై కమల్ హాసన్ కామెంట్స్ చినికి చినికి గాలివానలా మారుతున్నాయి. కమల్ క్షమాపణలు చెప్పకుంటే 'థగ్ లైఫ్' మూవీని రిలీజ్ కానివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చింది కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్. అటు కమల్ కూడా అస్సలు తగ్గడం లేదు. తన కామెంట్స్‌ను సమర్థించుకుంటూనే తాను ఏమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు.. 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ ఆపకుండా చూడాలని కమల్ హైకోర్టును ఆశ్రయించారు. అసలు మొదటి నుంచి ఈ వివాదం ఎక్కడ మొదలైందనే విషయాన్ని పరిశీలిస్తే..
కన్నడ భాషపై కమల్ కామెంట్స్
చెన్నైలో ఇటీవల జరిగిన 'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది' అంటూ కామెంట్స్ చేశారు కమల్ హాసన్. తన జీవనం, తన కుటుంబం తమిళం అని చెప్పారు. తర్వాత అదే వేదికపై ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వైపు చూస్తూ.. 'మీ భాష కన్నడ.. తమిళ్ నుంచి జన్మించింది, కాబట్టి మీరు కూడా తమిళ కుటుంబంలో భాగమే' అని అనగా.. ఆ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి.
Also Read: డిసెంబర్‌లో ప్రభాస్ రాజుగారి సినిమా... హారర్ కామెడీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు సాబ్
బీజేపీ, కేఎఫ్‌సీసీ ఆగ్రహం
ఈ కామెంట్స్‌పై అధికార, విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడియూరప్ప కమల్‌పై మండిపడ్డారు. మాతృభాషను ప్రేమించడం మంచిదే అని కానీ ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదని అన్నారు. కన్నడిగుల ఆత్మ గౌరవాన్ని ఆయన అవమానించారని.. కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కన్నడిగులు సైతం కమల్ కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటు.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కూడా తీవ్రంగానే స్పందించింది. కమల్ సారీ చెప్పకుంటే 'థగ్ లైఫ్' సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై ఆయన్ను నేరుగా కలిసేందుకు కూడా ప్రయత్నించాయి. ఆయన వ్యాఖ్యల్లో నిజం లేదని.. తమిళం నుంచి కన్నడ పుట్టలేదన్నారు.
సారీ చెప్పను.. కమల్ వివరణ
అయితే.. కన్నడ భాషపై తాను చేసిన కామెంట్స్‌ను కమల్ సమర్థించుకున్నారు. ఆ వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని.. భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని.. ఇది తనకు కూడా వర్తిస్తుందన్నారు. దీనిపై చర్చను చరిత్రకారులు, భాషా నిపుణులకు వదిలేద్దామంటూ.. నేరుగా సారీ చెప్పేందుకు నిరాకరించారు. 'నేను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను. భారత్ ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతాను. వాటిని గౌరవిస్తాను. ఈ విషయంలో ప్రజలు జోక్యం చేసుకోవద్దు.' అంటూ కోరారు.
హైకోర్టును ఆశ్రయించిన కమల్
అధికార, విపక్ష పార్టీలు, కన్నడ సంఘాలు ఈ అంశంపై భగ్గమంటుండగా.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కమల్ హాసన్‌తో పాటు నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
'థగ్ లైఫ్' రిలీజ్‌కు ఆటంకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, చలన చిత్ర వాణిజ్య విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా స్క్రీనింగ్‌కు తగిన భద్రత కల్పించేలా డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్‌కు సూచనలు జారీ చేయాలని కోరారు. మరోవైపు.. ఈ విషయంపై చర్చించేందుకు కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం కానుంది. ఈ నెల 5న 'థగ్ లైఫ్' రిలీజ్ కావాల్సి ఉంది.






















