Telangana Elections 2023: బీసీ నేతను సీఎంగా ప్రకటించే దమ్ముందా? - రాహుల్‌కి బండి సంజయ్ సవాల్
Telangana Elections 2023: తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ... బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు సంజయ్. బీసీలను అవమానించడమేనంటూ మండిపడ్డారు.
Telangana Elections 2023: అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. భారతదేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ ఏనాడూ ఈ ఆలోచన చేయలేదని విమర్శించారు. అధికారం కోల్పోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న టైంలో ఇప్పుడు గణన ఇష్యూ ఎత్తుకున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు.
తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ... బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు సంజయ్. బీసీలను అవమానించడమేనంటూ మండిపడ్డారు. మొన్న కేసీఆర్ కుమారుడు, నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీసీ సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగమనన్నారు. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీలను అవమానిస్తున్నారు
బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు బండి. గత పార్లమెంట్ ఎన్నికల నుంచి ఆ తరువాత అన్ని ఉపఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కంటే ఎక్కువగా సీట్లు, ఓట్లు సాధించామని గుర్తు చేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం కూడా ఖాయమన్నారు.
బీసీలకు అందలం
పేదింటి ఓబీసీ బిడ్డ నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేసిన చరిత్ర బీజేపీకి ఉందని గుర్తు చేశారు సంజయ్. 27 మంది ఓబీసీలను కేంద్ర మంత్రులుగా చేసిన పార్టీ బీజేపీ అని, దళిత, ఆదివాసీ, మైనారిటీ బిడ్డలను రాష్ట్రపతి చేసిన ఘనత కూడా తమదేనన్నారు. అదే బాటలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తిని సీఎం చేయడం తథ్యమన్నారు.
చివరి దశలో బీసీ గణన
మరి కాంగ్రెస్ చేసిందేమిటని ప్రశ్నించారు సంజయ్. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా ఓబీసీ వ్యక్తిని ప్రధానమంత్రిని ఎందుకు చేయలేదని నిలదీశా౩రు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష స్థానం కోల్పోయి కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకమయ్యాకే ఓబీసీ కులగణన గుర్తు కొచ్చిందా? క్వశ్చన్ చేశారు. తెలంగాణలో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పార్టీగా హీనదశకు చేరిన తరువాత ఓబీసీలు గుర్తుకొచ్చారా? అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో పట్టుమని 10 శాతం సీట్లు కూడా లేని పార్టీ కాంగ్రెస్ అని సెటైర్లు వేశారు. ప్రతిపక్ష స్థానం కోల్పోయి మరణశయ్యపై ఊగిసలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కులగణన ఎట్లా చేపడుతుందో సమాధానం చెప్పాలని రాహుల్‌ను ప్రశ్నించారు.
బీసీని సీఎంగా ప్రకటించే దమ్ముందా- రాహుల్‌కు సంజయ్ సవాల్
ఓబీసీ జపం చేస్తున్న రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని నిలదీశారు సంజయ్. రాష్ట్రంలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తున్న పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్దమా? అని సవాల్ చేశారు. ఓబీసీ కులగణన విషయంలో రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందన్నారు.
దమ్ముచూపుదాం: సంజయ్
తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా? అని నిలదీశారు. ఈ మేరకు ప్రకటన చేసే సత్తా ఉందా? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీలపట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని ప్రకటించాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌ను బీసీలే రాజకీయ సమాధి చేస్తారని శాపనార్థాలు పెట్టారు. బీసీలంతా ఏకమై దమ్ము చూపూ సమయమొచ్చిందని పిలుపునిచ్చారు. బీసీలను అడుగడుగునా అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పాలని కోరారు.