Yashaswini Reddy : 37 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మంత్రికి షాక్ ఇచ్చిన 26 ఏళ్ల యువతి యశస్విని రెడ్డి
Yashaswini Reddy: అందరూ అనుకోని సాధిస్తే కదా అద్భుతం అవుతుంది. అలాంటి అద్భుతమైన విజయాన్నే సాధించారు యశస్విని రెడ్డి.
Yashaswini Reddy Defeated Minister Errabelli Dayakar : ఆ మంత్రి రాజకీయ అనుభవం అంత వయసు లేదు ఆమెకు. 26 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేశారు. పొలిటికల్ స్టాల్‌వాల్ట్‌ను ఢీ కొట్టారు. అయితేనేం ప్రజలను మెప్పించారు. విజయం సాధించారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్ అయ్యారు యశస్విని రెడ్డి.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌పై పోటీ అంటే ఆశామాషీ కాదు. 1985 నుంచి ఓటమి అంటూ లేకుండా అప్రహతిహాతంగా సాగిపోతున్న మంత్రిపై పోటీ అంటే హేమాహేమీలకే తడిసిపోతుంది. అలాంటిది రాజకీయాల్లో ముక్కుపచ్చలారని యువతి ఢీ కొట్టారంటే ఎవరైనా నవ్వుతారు. ఆయనకి ఉన్న అనుభవం ముందు ఈమె అసలు సరితూగుతారా కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుంటారా అనే అనుమానం అందరికీ కలుగుతుంది.
అందరూ అనుకోని సాధిస్తే కదా అద్భుతం అవుతుంది. అలాంటి అద్భుతమైన విజయాన్నే సాధించారు యశస్విని రెడ్డి. 37 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పని చేసిన ఎర్రబెల్లిని ఓడించి తెలంగాణ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారారు యశస్విని రెడ్డి. ఈ సీటు యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి రావాల్సింది. కానీ ఆమె ఎన్నారై కావడంతో భారత పౌరసత్వం లేని కారణంగా ఆమె పోటీకి ఆంటకం ఎదురైంది. ఆమె పెట్టుకున్న భారత పౌరసత్వం అప్లికేషన్‌పై ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోకపోవడంతో యశస్విని రెడ్డిని పోటీలోకి దింపారు.
పార్టీ సీటు రావడానికి బ్యాక్ గ్రౌండ్ పనికి వచ్చినా ఎర్రబెల్లిపై గెలవడం అంత ఆషామాషీకాదు. అందుకే పార్టీ టికెట్ వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు ఎత్తి చూపుతూ ప్రచారం చేశారు. ఎర్రబెల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇంకా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఇలా అన్ని వైపుల నుంచి దిగ్బంధించి ఎర్రబెల్లికి ఓటమి రుచి చూపించారు.
తన గెలుపు ప్రజా అభివృద్ధికి అంకితం చేస్తానన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల కోసం ముందుకొచ్చి విజయం సాధించామని అన్నారు. ప్రజలు దీవిస్తేనే బలమైన నాయకులు అవుతారని యశస్విని రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆమె విజయంతో యశస్విని రెడ్డి ఇంట్లో సంబరాలు చేసుకున్నారు అభిమానులు. తొర్రూరు పట్టణంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఆమె అభిమానులు పెద్దఎత్తున ఇంటికి చేరుకొని అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ విజయం తనది కాదని.. పాలకుర్తి ప్రజలందరికీ దక్కుతుందన్నారు.