Telangana Election 2023: పోలింగ్ ముందు రోజే పోస్టల్ బ్యాలెట్-మరో 20 రోజుల్లో ఓటర్ స్లిప్పులు
తెలంగాణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ దగ్గర నుంచి... ఎన్నికల వరకు అన్నీ సక్రమంగా జరిగేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికలకు.. సరిగ్గా 40 రోజులు కూడా లేవు. దీంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి పెడుతున్నారు. ఎన్నిక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అంతా సక్రమంగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ నుంచి పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, పోస్టల్ బ్యాలెట్లు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నవంబర్ 10 తర్వాత ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఓటరు సమాచారాన్ని స్టికర్స్ రూపంలో ప్రతి ఇంటికి అతికిస్తామని చెప్పారు.
బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌లో జరిగిన సెక్టోరియల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ పాల్గొన్నారు. ఎన్నికలు సక్రమంగా, సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టోరియల్ ఆఫీసర్‌ను నియమించినట్టు చెప్పారాయన. సెక్టోరియల్ ఆఫీసర్ తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్‌ను మూడు సార్లు పరిశీలించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస అవసరాలు ఉండేలా చూసుకోవాలన్నారు. వాటిఓపాటు దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులు, తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు తదితర సౌకర్యాలపై ఫోకస్ పెట్టాన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా సెక్టోరియల్ ఆఫీసర్ పరిషరించాలన్నారు. ఈవీఎంలపై త్వరలో అవగాహన కల్పిస్తామని చెప్పారు. పోల్‌రోజు ముందుగా మాక్ కూడా నిర్వహిస్తామని చెప్పారు రొనాల్డ్‌రాస్.
ఎన్నికల్లో పాల్గొనే.. పోలింగ్ సిబ్బందికి ఒక రోజు ముందే పోస్టల్ బ్యాలెట్ అందజేస్తామని చెప్పారు. మహిళా పోలింగ్ సిబ్బంది పోలింగ్ రోజు ఉదయం 5 గంటలకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో రిపోర్టు చేసేందుకు వెసులుబాటు ఉందని చెప్పారు. పోలింగ్‌కు వారం ముందు నుంచి సెక్టోరియల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయని... ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా క్యూలో నిలబడిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో 1500 ఓటర్లకు మించి ఉంటే... వాటిని ఆగ్జలరి పోలింగ్ కేంద్రాలుగా పిలుస్తున్నారు. వాటిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాలకు దగ్గరలో పారింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు సంబంధిత అధికారులు. అక్టోబర్ 4న ప్రచురించిన తుది ఓటరు జాబితాలో ఓటరు పేరు నమోదుతో పాటు సప్లిమెంటరీ ఓటరు లిస్ట్‌లో కూడా ఓటరు పేరు ఉన్నట్టయితే ఓటు హక్కుకి అర్హులని చెప్తున్నారు.
సెక్టోరియల్ ఆఫీసర్లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను.... పోలింగ్ ముందు.. గంట నుంచి గంటన్నర వ్యవధిలో పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ రోజు ఈవీఎంలలో సాంకేతిక సమస్య వస్తే.. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై కూడా.. సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో మరోసారి పునఃపరిశీలించుకోవాలిన... పేరులేకపోతే ఈనెల 31వ తేదీ వరకు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మహిళలకు, సీనియర్ సిటిజన్స్‌కు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌ల సమక్షంలో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు కూడా కొన్ని సూచనలు చేశారు ఎన్నికల అధికారులు. రాజకీయ పార్టీ ఏజెంట్లు ఫోన్ నంబర్లు కలిగి ఉండాలని సూచించారు. అలాగే.. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు రాజకీయ పార్టీల ఆఫీస్‌లు ఉండకూడదన్నారు.