Revanth Vs KCR: 24 గంటల కరెంటు సరఫరాపై రేవంత్ సవాల్- నామినేషన్లు విత్‌డ్రా చేసుకుంటానని ఆఫర్
Revanth Reddy Challange To KCR : 24 గంటల కరెంటుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య సవాల్ ప్రతిసవాల్‌లు కొనసాగుతున్నాయి. దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన సవాల్ చేశారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ సీఎం కేసీఆర్(KCR)కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సవాల్ చేశారు. కరెంటుపై చర్చకు తాను సిద్ధమని లాగ్ బుక్‌లతో కీసీఆర్ రావాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఇద్దరూ పోటీ చేస్తున్న కామారెడ్డి (Kamareddy)చౌరాస్తాలోనే చర్చిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా పూర్తి స్థాయిలో 24 గంటల పాటు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారాయన.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విద్యుత్ చుట్టూనే తిరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో దీన్నే ప్రధాన అంశంగా చేసుకొని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటున్నారు. గతంలో తెలంగాణ పీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్‌ను చూపిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
జోరుగా నియోజకవర్గాలను చుట్టేస్తున్న బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తోపాటు మిగతా బడా నేతలంతా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ప్రతి సభలో కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అంటూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకట్లు ఖాయమంటూ భయపెడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చుకోవాలంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ఈ విమర్శలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. అందులో భాగంగానే కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చిద్దాం రమ్మని పిలుపునిచ్చారు. 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్‌లో ఇటు కామారెడ్డిలో నామినేషన్ ఉపసంహరించుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉందని ఈ లోపు కేసీఆర్ లాగ్ బుక్‌లతో రవాలాని అన్నారు.