నర్సాపూర్ నుంచి పోటీ చేసి తీరుతా : సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
మెదక్ జిల్లా నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోయినా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. తన అనుచరులు, సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నారని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి చిలుముల మదన్‌రెడ్డి విజయం సాధించారు. మూడోసారి పోటీచేసి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. తనను నమ్ముకున్న వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రగతిభవన్‌కు రావాలని కబురు పంపినా ఆయన వెళ్లలేదు. ఇవాళ రావాలని కచితంగా రావాలని సమాచారం అందజేశారు.
సునీతా లక్ష్మారెడ్డికే టికెట్ ?
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికే అధిష్ఠానం టికెట్ ఇస్తుందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో మదన్ రెడ్డి అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై మద్దతుదారులు పలు రకాలుగా నిరసనలు తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ మదన్‌రెడ్డితో మాట్లాడినా స్పష్టత రాలేదు. ఓ వైపు అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేస్తున్నా నర్సాపూర్ టికెట్ వ్యవహారంలో ఉత్కంఠ వీడటం లేదు. తాజాగా సీఎం కేసీఆర్ మదన్‌రెడ్డిని జనగామ, భువనగిరి ఎన్నికల ప్రచార సభలకు తన వెంట తీసుకెళ్లారు. మరో పదవి ఇస్తామని మదన్ రెడ్డికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా చిలుముల మదన్‌రెడ్డి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అనుచరులు మాత్రం పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు ముఖ్య నేతలకు ఫోన్ చేసి అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
పోటీ చేసి తీరుతానన్న మదన్ రెడ్డి
115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్, నర్సాపూర్, జనగాం, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి 74 సంవత్సరాలు ఉండటంతో అభ్యర్థిని మార్చాలనే ఆలోచనలో ఉంది పార్టీ నాయకత్వం. మదన్ రెడ్డికి నర్సాపూర్ పార్టీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ క్రమంలో మదన్ రెడ్డి తన ఫాలోవర్స్ తో కలిసి హరీశ్ రావు ఇంటి ముందు ధర్నా చెయ్యడం, ముఖ్యమంత్రిని, కేటీఆర్ కలిసి మళ్లీ తన పేరు ప్రకటించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తాను ఎన్నికల్లో పోటీచేస్తానని వెనుక్కి తగ్గేది లేదని మదన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
మూడుసార్లు గెలిచిన సునీతా లక్ష్మారెడ్డి
సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె. రోశయ్య మంత్రివర్గాల్లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో సునీత లక్ష్మా రెడ్డి, మహిళా సంక్షేమం, శిశు సంక్షేమం, ఇందిరా క్రాంతి, పెన్షన్ల పోర్ట్‌ఫోలియోను నిర్వహించారు. 2019 ఏప్రిల్ 3న మెదక్ లో ఆమె టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.