మాజీ మంత్రి తుమ్మల రాజకీయ పయనం ఎటు ?- కాంగ్రెస్‌లో చేరాలంటూ పెరుగుతున్న ఒత్తిడి
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా మారింది. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ఆయన అనుచరవర్గం ఒత్తిడి చేస్తోంది.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...రాజకీయ ప్రయాణంపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. అనుచరులు చెప్పినట్లు కాంగ్రెస్‌లో చేరుతారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో...ఆయన అనుచరవర్గం సమావేశాలు నిర్వహించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో...పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ పాలేరు సీటుని కందాల ఉపేందర్ రెడ్డికి ఇచ్చారు. తుమ్మలకు మొండిచేయి చూపించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తుమ్మల అనుచర వర్గం రగిలిపోతోంది.
కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఖమ్మం వెళ్లనున్నారు. తుమ్మల రాక సందర్భంగా ఆయన అనుచరులు భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బల ప్రదర్శన చేయనున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ఆయన అనుచరవర్గం ఒత్తిడి చేస్తోంది. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బలంగా లేకపోవడంతో తుమ్మల హస్తం పార్టీ నుంచి పోటీ చేయాలని ఆయన వర్గం ఒత్తిడి పెంచుతోంది.
పాలేరు లేదా ఖమ్మం నుంచి ఎక్కడి నుంచైనా సరే పోటీ చేయాల్సిందేనన్న డిమాండ్‌ను తుమ్మల ముందు పెడుతున్నారు అనుచరులు. దీనిపై తుమ్మల నాగేశ్వరరావు మాత్రం నోరు మెదపలేదు. తాను ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని తన అనుచర వర్గానికి చెప్పేశారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై తుమ్మల క్లారిటీ ఇవ్వలేదు. తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీ వైపు వెళ్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకొస్తే స్వాగతిస్తామన్నారు కేంద్ర మాజీ మంత్రి త్మంత్రి రేణుక చౌదరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సముద్రం లాంటిదన్న ఆమె... అందరూ ఇక్కడి నుంచి ఎదిగిన వారేనన్నారు. మోసపు మాటలతో గద్దెనెక్కిన కేసీఆర్ 9 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఇవాళ జరిగే కార్యకర్తల సమావేశంలో రాజకీయ అడుుగులు ఎటు అన్న దానిపై క్లారిటీ ఇస్తారని అనుచరులు ధీమాలో ఉన్నారు. అనుచరులంతా కాంగ్రెస్ లోకి వెళితేనే భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
తుమ్మల నాగేశ్వరరావు ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985,1994,1999,2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 2016లో బీఆర్ఎస్ లో చేరి అసెంబ్లీకి పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
1985 ఎన్నికల్లో తొలిసారి గెలుపొందిన తుమ్మల ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 నుంచి 1999 వరకు ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల , ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు కేబినెట్ లో భారీ నీటి పారుదల, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగానూ పని చేశారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత కెసిఆర్ మంత్రివర్గంలో 2015 నుంచి 2018 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రోడ్డు, భవనాలు శాఖల మంత్రిగా పనిచేశారు.