TDP Trouble Shoot Team: ఆశావహులను బుజ్జగిస్తున్న టీడీపీ ట్రబుల్ షూట్ టీమ్, పది స్థానాలను సెట్ చేసిన నేతలు
TDP News: తెలుగుదేశం పార్టీ తరపున సీట్లు ఆశిస్తున్న నేతలను బుజ్జగించేందుకు...చంద్రబాబు ప్రత్యేక టీంను తయారు చేశారు. పార్టీలోని సీనియర్లు, జూనియర్లతో కలిపి...దీన్ని ఏర్పాటు చేశారు.
Tdp Trouble Shoot Team : అసెంబ్లీ (Assembly), పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections ) పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party ) కసరత్తును వేగవంతం చేసింది. వీలయినంత త్వరగా అభ్యర్థులను కొలిక్కి తేవాలని చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu)భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలపై ఓ అవగాహనకు వచ్చిన చంద్రబాబు... మరికొన్ని సీట్లపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్లపై క్లారిటీ రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ కోల్పోయే సీట్లపై ఇంకా కొలిక్కి రాలేదు. జనసేన కోరుకుంటున్న నియోజకవర్గాల్లో...టీడీపీ నుంచి చాలా మంది ఆశావహులు ఉన్నారు. వారంతా తమకు సీటు కావాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ తరపున సీట్లు ఆశిస్తున్న నేతలను బుజ్జగించేందుకు...చంద్రబాబు ప్రత్యేక టీంను తయారు చేశారు. పార్టీలోని సీనియర్లు, జూనియర్లతో కలిపి...దీన్ని ఏర్పాటు చేశారు. వీరంతా టికెట్లు ఇవ్వలేని నేతలను...పార్టీ కార్యాలయానికి బుజ్జగింపులు, సర్ది చెప్పడం ప్రారంభించారు.
20 మంది నేతలకు నో టికెట్
ఇప్పటికే 15-20 మంది నేతలకు టిక్కెట్లు లేవని కూడా టీడీపీ చెప్పేసినట్టు తెలుస్తోంది. మరికొందరికి టిక్కెట్ల విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. 35-40 సెగ్మెంట్లల్లో అభ్యర్థుల ఎంపిక మీద ఇంకా క్లారిటీకి రావాల్సి ఉంది. ఈ సెగ్మెంట్లల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నా.. కొద్దిగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులను ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నట్టు కన్పిస్తోంది. టీడీపీ ఏర్పాటు చేసుకున్న ట్రబుల్ షూటింగ్ టీంలో సీనియర్ నేతలు మొదలుకుని.. జూనియర్ నేతల వరకు ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పర్యటించారు. వివిధ సెగ్మెంట్లల్లో ఆశావహులు, జిల్లాలోని కీలక నేతల అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురం, కొవ్వూరు, చింతలపూడి వంటి సెగ్మెంట్లల్లో అభిప్రాయ సేకరణ చేపట్టింది ట్రబుల్ షూట్ టీమ్. చింతలపూడి, కొవ్వూరు నియోజకవర్గాల నేతలను సెట్ చేసినట్లు తెలుస్తోంది. గోపాలపురం విషయంలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 10 స్థానాల్లో ఇబ్బందుల్లేకుండా ట్రబుల్ షూటింగ్ టీం తన పనిని చక్కబెట్టినట్టు సమాచారం.
పెనమలూరు నుంచి దేవినేని ఉమా ?
ట్రబుల్ షూటింగ్ టీంలోని సీనియర్ సభ్యులు....మైలవరం సీటు ఆశిస్తున్న సిట్టింగ్ ఇన్ చార్జ్, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావుతో భేటీ అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో మైలవరం సీటు బెట్టు వీడాలని...పెనమలూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. పెనమలూరు స్థానం నుంచి దేవినేని ఉమమహేశ్వరరావు పోటీ చేస్తే...కలిసి వచ్చే అంశాలను కూడా ట్రబుల్ షూట్ టీం సభ్యులు వివరించినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీని, పార్టీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టే విధంగా కామెంట్లు చేయవద్దని...వసంత కృష్ణప్రసాద్ పైన కామెంట్లు చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. అప్పుడు తలూపిన దేవినేని ఉమ.. ఆ తర్వాత తన అనుచరులతో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేయించారు. మళ్లీ కామెంట్లు చేయడంతో...ఏం చేయాలనే దానిపై పార్టీ అధినాయకత్వం సీరియస్‌గానే ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అటు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కూడా ఆశావహులతో ట్రబుల్ షూటింగ్ టీం సభ్యులు విడివిడిగా భేటీ అయ్యారు. అటు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వ్యవహరం దాదాపు చక్కబెట్టినట్టు తెలుస్తోంది. సీనియర్ నేతలకు టిక్కెట్లివ్వలేని పరిస్థితి ఉంటే.. వారి కోసం సీనియర్లను రంగంలోకి దింపుతోంది.