Cheepurupalli Assembly constituency: చీపురుపల్లి అభ్యర్థి కోసం వెతుకుతున్న టీడీపీ? కళా, గంటా విముఖతకు కారణాలేంటి?
Cheepurupalli Assembly constituency: విజయనగరంజిల్లా చీపురుపల్లిలోవిద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ తరఫున పోటీలో ఉంటున్నారు. ఆయన్ని ఢీకొట్టే అభ్యర్థి కోసం గత కొన్నాళ్లుగా టీడీపీ వెతుకుతోంది.
TDP In Cheepurupalli Assembly constituency: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ముందుగా ఈ సీటులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేయాలనే ప్రతిపాదని టీడీపీ చేసింది. ఆయన వద్దని చెప్పడంతో మరో మాజీ మంత్రి కళావెంకటరావు పేరు తెరపైకి వచ్చింది. ఆయన కూడా ససేమిరా అనడంతో ఇప్పుడు అభ్యర్థి కోసం టీడీపీ వెతుకుతోంది.
విజయనగరంజిల్లా చీపురుపల్లిలోవిద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ తరఫున పోటీలో ఉంటున్నారు. ఆయన్ని ఢీకొట్టే అభ్యర్థి కోసం గత కొన్నాళ్లుగా టీడీపీ వెతుకుతోంది. ఇందులో భాగంగానే మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు చీపురుపల్లి సీటిస్తామని ఫీలర్ వదిలింది. ఎన్నికలకో నియోజకవర్గం మారే ఆయనకు చీపురుపల్లి పంపింతే గెలిచి వస్తారని టీడీపీ భావించింది. అయితే తను ఉండే విశాఖకు చీపురుపల్లికి చాలా దూరం ఉందని ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనని చెప్పి తప్పుకున్నారు.
వాస్తవానికి గంటా శ్రీనివాసరావుకు ఒకసారి పోటీ చేసే నియోజకవర్గంలో మరోసారి పోటీ చేసే అలవాటులేదు. 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచిన గంటా శ్రీనివాసరావు 2004లో చోడవరంలో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యంపార్టీ పెట్టినప్పుడు అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో టీడీపీ తరఫున భీమిలిలో జెండా పాతారు. 2019లోవిశాఖ నార్త్ నుంచి పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్సపై పోటీకి నిలపాలని టీడీపీ భావిస్తే ససేమిరా అంటున్నారు. భీమిలి నుంచి పోటీకి సిద్ధమనే సంకేతాలు పంపారు.
బొత్స ప్రాతినిధ్యంవహిస్తున్న చీపురుపల్లికి అభ్యర్థి ఎంపిక తెలుగుదేశం పార్టీకి సమస్యగా మారింది. గంటా శ్రీనివాసరావు కంటే ముందు టీడీపీ మాజీ మంత్రి, పోలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు పేరును కూడా పరిశీలించింది. కిమిడి కుటుంబమే చీపురుపల్లిలో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2014లో కళావెంకట్రావు మరదలు కిమిడి మృణాళిని బొత్స సత్యనారాయణపై గెలుపొందారు. అప్పుడు మంత్రిగా కూడా చేశారు. 2019లో బొత్సపై మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా కిమిడి నాగార్జున టిక్కెట్ ఆశిస్తున్నారు. దీనికి తోడు ఆయన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కుటుం బంలో ఉన్న విభేదాల కారణంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి టీడీపీ జంకుతోంది.
కిమిడి కళా వెంకట్రావు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే అన్నీ సర్దుకుంటాయని భావించింది. కళా వెంకట్రావు ఇన్ఛార్జిగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కలిశెట్టి అప్పలనాయుడుకు లైన్ క్లియర్ చేసినట్టవుతుందని పార్టీ భావించింది. కానీ కళా వెంకట్రావు కూడా చీపురుపల్లి వెళ్లడానికి అంగీకరించ లేదు. దాంతో కళా కోరుతున్న ఎచ్చెర్ల సీటును కూడా మొదటి జాబితాలో ప్రకటించలేదు.
చీపురుపల్లి నుంచి బొత్సపై పోటీ చేయడానికి 2014లో విజయనగరం ఎమ్మెల్యేగా పని చేసిన మీసాల గీతను దింపడానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఇది కాపు నియోజకవర్గం కావడంతో మీసాల గీతకు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నా యి. కళా గానీ, గంటా గానీ చీపురుపల్లి వెళ్లబోమని చెప్పడానికి ప్రధాన కారణం బొత్స బలమైన అభ్యర్థి కావడమే. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతోపాటు పోల్ మేనేజ్మెంట్లో దిట్టగా పేరొందిన బొత్సను ఢీకొట్టడం అంత సులభం కాదని వీరు భావించడమే. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సత్యనారాయణ 2014లో ఓడినా.. 2019లో మళ్లీ 26,498 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
టీడీపీ హవాకు అడ్డుకట్ట
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి కంచుకోటగా ఉన్న చీపురుపల్లి క్రమంగా బొత్స కుటుంబీకుల హస్తగతమైంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఉత్తరాంధ్రలో ముగ్గురు నాయకులకు పెత్తనం ఇచ్చారు. విశాఖపట్నం నుంచి ఎంవీవీఎస్ మూర్తి, విజయ నగరం (చీపురుపల్లి) నుంచి గద్దె బాబూరావు, శ్రీకాకుళం (ఇచ్ఛాపురం) నుంచి ఎంవీ కృష్ణారావు గెలుపొందుతూ వచ్చారు. విజయనగరంలో గద్దె బాబూరావు హవాకు అడ్డుకట్ట వేసి చీపురుపల్లిని కాంగ్రెస్ ఖాతాలో వేసింది బొత్స సత్యనారాయణే. ప్రస్తుతం విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) కుటుంబానికి చీపురుపల్లిలో గట్టి పట్టు ఉంది. సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ వరకు ఆ కుటుంబం చీపురుపల్లి రాజకీయాలను ప్రభావితం చేసింది. వారి సహకారంతోనే బొత్స మొదటిసారి చీపురుపల్లిలో 2004లో పోటీ చేశారు. కాపులకు పెద్దదిక్కుగా ఉన్న పెదబాబు కుటుంబం కూడా వైసీపీతో ఉండటం వల్ల బొత్సను ఇక్కడ ఢీకొట్టడం అంత సులువు కాదని టీడీపీ భావిస్తోంది.
బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టిక్కెట్ ఇస్తున్నందున ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తారని, మజ్జి శ్రీను (చినశ్రీను)కు విజయనగరం అప్పజెప్పి బొత్స కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి వైజాగ్‌కు షిప్ట్ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. కానీ టీడీపీ నుంచి అభ్యర్థులెవరూ చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి సిద్ధపడకపోవడంతో బొత్స ఇక్కడి నుంచే పోటీలో ఉంటారని తేలిపోయింది.
అన్నివైపుల నుంచి బొత్స ముట్టడి
నెల్లిమర్ల నుంచి పోటీ చేయాల్సి ఉంటుందని చిన్నశ్రీనుకు 2019లోనే జగన్మోహన్‌రెడ్డి చెప్పారట. కానీ బొత్స మరో బంధువు బడ్డు కొండ అప్పలనాయుడుకు నెల్లిమర్ల టిక్కెట్ ఇప్పించి గెలిపించుకోవడంతో చిన్నశ్రీను జెడ్పీ చైర్మన్ పోస్టుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి జెడ్పీ చైర్మన్ సీటు కూడా ఎస్సీకి రిజర్వు అయితే కేవలం చిన్నశ్రీనును అకామిడేట్ చేయడానికి ఆ రిజర్వేషన్ని మార్చారనే ప్రచారం కూడా ఉంది.
ఇప్పుడు జగన్ కోటరీలో చిన్నశ్రీనుది కీలకమైన పాత్రే. రాజాం నుంచి సిట్టింగ్ఎమ్మెల్యే కంబాల జోగులును పాయకరావుపేట పంపడం, రాజాంలో కొత్త అభ్యర్థి డాక్టర్ తలేరాజేష్‌ను ఇన్ఛార్జిగా ప్రకటించడంతోపాటు అక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతను చిన్నశ్రీను మీద పెట్టడం ఇందుకు నిదర్శనం. చీపురుపల్లిలోఅభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజానికెత్తుకునే బెల్లాన చంద్రశేఖర్ కుటుంబం ఒకవైపు, ఇటు రాజాం నుంచి వైసీపీ బాధ్యతలు చూస్తున్న చిన్నశ్రీను ఎత్తుగడలు మరోవైపు ఉండటం వల్ల చీపురుపల్లిని టీడీపీ అంత సులువుగా వశంచేసుకోలేదని భావిస్తున్నారు.
బొత్స కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉన్నా ఎన్నికల దగ్గరకొచ్చేసరికి వారంతా ఒక్కటైపోతారన్న ప్రచారం ఉంది. బెల్లాన అభ్యర్థిత్వంపై అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతోపాటు తేడా వస్తే చీపురుపల్లిలో తన గెలుపు కష్టమవుతుందని భావించిన బొత్స సత్యనారాయణ తాజాగా మాజీ జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడును వైసీపీ గూటికి చేర్చేశారు. ఇప్పుడు మీసాలగీత బొత్స మీద పోటీ చేస్తే మీసాల వరహాలనాయుడు మద్దతుతో గెలుపొందడానికి సత్తిబాబు ప్రణాళిక రచించుకుంటున్నారు.
వాస్తవానికి చీపురుపల్లి నుంచి పోటీ చేయమని టీడీపీ కోరిన గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావు సాధారణమైన నాయకులు కారు. గంటా శ్రీనివాసరావు ప్రకాశం జిల్లాకు చెందిన కాపు. విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకోడానికి వచ్చి ప్రత్యూష షిప్పింగ్ కంపెనీని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు అపజయం లేకుండా నియోజకవర్గాలను మార్చి మార్చి గెలుస్తున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న ముందుగా ఆ నియోజకవర్గంలో ఆయన తన సొంత బృందంతో సర్వే చేయించుకునే అలవాటు ఉంది. అందులో సానుకూల ఫలితాలు వస్తేనే ముందడుగు వేస్తారు. అదే రీతిలో చీపురుపల్లిలోనూ సర్వే చేయించి ఉంటారని, అందులో వ్యతిరేక ఫలితం రావడం వల్లే దూరం, వేరే జిల్లా అని సాకులు చెబుతున్నట్లు భావిస్తున్నారు.
కళా వెంకట్రావు కూడా ఉణుకూరు, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి గెలుపొందిన చరిత్ర ఉండగా, పిన్నవయసులోనే రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. పేరుకు శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యుడైనా, ఆయన రాజకీయ క్షేత్రం మాత్రం విజయనగరం జిల్లాయే. కానీ బొత్స మీద పోటీ అనేసరికి టీడీపీకి అభ్యర్థులు దొరక్కపోవడం కేడర్ డైలమాలో ఉంది.