TDP: ఆ 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మార్పు - చంద్రబాబు కీలక నిర్ణయం!
Andhrapradesh News: మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా టీడీపీ తాజాగా 4 స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును ఆయా నేతలు కలిశారు.
Tdp Changed Candidates In 4 Places: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల పొత్తుల్లో బాగంగా టీడీపీ (Tdp) 144 అసెంబ్లీ స్థానాలకు గాను, 17 ఎంపీ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, టికెట్లు దక్కని నాయకులు చాలా చోట్ల అసహనం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా 4 చోట్ల టీడీపీ అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఆయా స్థానాల్లో మారిన రాజకీయ సమీకరణలు, శ్రేణులు, నేతల అభిప్రాయం మేరకు చంద్రబాబు (Chandrababu) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎస్సీ సెల్ నేత ఎంఎస్ రాజు ఆదివారం చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. పాడేరు - గిడ్డి ఈశ్వరి, ఉండి - రఘురామకృష్ణంరాజు, మడకశిర - ఎంఎస్ రాజు, మాడుగుల - బండారు సత్యన్నారాయణకు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అటు, వెంకటగిరి స్థానాన్ని ఇదివరకూ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. అయితే, మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించనున్నారు.
ఆ 2 స్థానాలపై సందిగ్థత
ఇవి కాకుండా కూటమి పొత్తుల్లో బాగంగా మరో రెండు స్థానాల్లో కూడా సందిగ్ధత కొనసాగుతోంది. అనపర్తి, దెందులూరు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో.. అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సైతం ఆయనకు స్వయంగా ఫోన్ చేసి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. తాను టీడీపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే, పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తడంతో.. ఆయన్ను బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఈ క్రమంలో నల్లమిల్లి అనపర్తిలో బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. అనపర్తి స్థానంపై పూర్తి స్పష్టత వచ్చాకే దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ ఫారాలను అందించనున్నట్లు సమాచారం.
అమరావతిలో టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించి, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించిన చంద్రబాబు గారు.
— Telugu Desam Party (@JaiTDP) April 21, 2024
అభ్యర్ధులు అందరికీ టిడిపి శ్రేణులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున శుభాకాంక్షలు.#TDPJSPBJPWinning #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/vqnOS78LnD
మరోవైపు, 144 అసెంబ్లీ స్థానాలకు, 17 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్ధులకు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో ఆదివారం బీ ఫారాలు అందజేయనున్నారు. అలాగే, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార శైలిపై దిశానిర్దేశం చేయనున్నారు. అటు, చంద్రబాబు ఆదేశాలతో తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరో సభ్యురాలిగా, ఉమ్మడి ప.గో జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు. అలాగే, నర్సాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు.
ముమ్మరంగా ప్రచారం
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూటమి అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు, ప్రధాని మోదీ సైతం ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా 4 బహిరంగ సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు పేర్కొంటున్నారు.
Also Read: Gummanuru Jayaram: గుంతకల్లులో చంద్రబాబు వ్యూహం ఏంటి? టికెట్ ఆయనకే ఎందుకిచ్చారు?