పొత్తు సూపర్ హిట్ అవుతుందన్న టీడీపీ, జనసేన లీడర్లు- 2019 ఎన్నికల గణాంకాలు విశ్లేషిస్తున్న నేతలు
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల మధ్య సీట్ల వ్యవహారంపై త్వరలోనే కొలిక్కి రానుంది. జనసేన 25 నుంచి 30 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల మధ్య సీట్ల వ్యవహారంపై త్వరలోనే కొలిక్కి రానుంది. ఈ వ్యవహారాలు చక్కబెట్టేందుకు సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. జనసేన 25 నుంచి 30 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అందులోనే ఉభయ గోదావరి జిల్లాల నుంచే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. జనసేనాని పొత్తు ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా 2024 అసెంబ్లీ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. జనసేన, టీడీపీ అభిమానులు ఓ అడుగు ముందుకు వేసి... వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. పొత్తు సూపర్ హిట్ కావడం ఖాయమని చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించనుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన ఓట్లను గణాంకాలుగా చూపుతున్నారు.
2014 ఎన్నికలను రిపీట్ చేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అప్పట్లో టిడిపికి మద్దతు మాత్రమే ప్రకటించారు. ఆ ఎన్నికల్లో టిడిపి 102 స్థానాలను దక్కించుకుంది. కేవలం పవన్ మాటతోనే కాపులు, అభిమానులు ఏకపక్షంగా టీడీపీ, బీజేపీ కూటమికి ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో టిడిపి, జనసేన వేర్వేరుగా పోటీ చేయడంతో రెండు పార్టీలకు ఓటమి ఎదురైంది. ముఖ్యంగా టిడిపికి అంతులేని నష్టం జరిగింది. ఒకవేళ గత ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుని ఉంటే మరో 40 నుంచి 50 స్థానాలు సునాయాసంగా విజయం సాధించేవాళ్లమని టీడీపీ విశ్లేషిస్తోంది. తెలుగుదేశం పార్టీ 70 స్థానాలు, జనసేన మరో 30 స్థానాలను దక్కించుకొని అధికారంలోకి వచ్చి ఉండేవని టీడీపీ జనసేన అభిమానులు లెక్కలతో సహా చూపెడుతున్నారు. నియోజకవర్గాల వారీగా వైసీపీకి వచ్చిన ఓట్లు, టీడీపీ, జనసేనకు వేర్వేరుగా వచ్చిన ఓట్లను లెక్క వేస్తున్నారు.
గత ఎన్నికల్లో టిడిపి, జనసేన విడిగా పోటీ చేయడం ద్వారా అలాంటి స్థానాల్లో ఓడిపోయామని ఆయా పార్టీల అభిమానులు బయటకు తీస్తున్నారు. వైసీపీకి గెలిచిన స్థానాలు, అదే నియోజకవర్గంలో టీడీపీ, జనసేనలకు వచ్చిన ఓట్లను కలుపుతున్నారు. దాదాపు 40 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే విధంగా ఈ ఓట్ల గణాంకాలు ఉన్నాయని అంటున్నారు. అచంట, అమలాపురం, అనకాపల్లి, అవనిగడ్డ, భీమవరం, భీమిలి, ఎలమంచిలి, ఏలూరు, గాజువాక, గన్నవరం, కైకలూరు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, కొత్తపేట, మచిలీపట్నం, మంగళగిరి, ముమ్మిడివరం, నగిరి, నరసాపురం, నెల్లూరు, సిటీ, నిడదవోలు, పెడన, పెనమలూరు, పిఠాపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, రామచంద్రాపురం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తాడికొండ, తణుకు, తెనాలి, తిరుపతి, వేమూరు, విజయవాడ, సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్ తదితర 40 నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన విడిగా పోటీ చేయడం కారణంగా వైసిపి గెలుపొందిందని విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కల గణాంకాలు చూసిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైందని టీడీపీ, జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. ఈ 40 స్థానాలపై వచ్చే ఎన్నికల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని నేతలు హెచ్చరిస్తున్నారు. వీటి ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాలపై పడుతుందని అంటున్నారు.
2019 ఎన్నికలు టీడీపీ,జనసేనకు గుణపాఠం నేర్పడంతో వచ్చే ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని టీడిపి,జనసేన విడిగా పోటీ చేస్తే గత ఎన్నికల ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో 2014 సీన్ రిపీట్ చేసి విజయం సాధించాలని రెండు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.