Srikakulam Assembly Constituency: శ్రీకాకుళంలో పోటీ చేసేది బీజేపీయా? టీడీపీనా? తముళ్లల్లో టెన్షన్
Elections 2024: శ్రీకాకుళం అసెంబ్లీ సీటు టీడీపీలో హీట్ రాజేస్తోంది. బీజేపీ బరిలో నిలుస్తుందన్న ప్రచారం తెలుగు తమ్ముళ్లను తెగ ఇబ్బంది పెడుతోంది. మాజీ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది.
Srikakulam Assembly Constituency: సిక్కోలు జిల్లా టీడీపీలో శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ కాకారేపుతోంది. ఇక్కడ రెండు వర్గాల మధ్య నడుస్తున్న ఫైట్‌తోనే తలనొప్పులు పడుతున్న టీడీపీకి ఇప్పుడు మరో తలనొప్పి తోడైంది. ఇక్కడ టికెట్ బీజేపీకి ఇస్తున్నారనే ప్రచారం నాయకుల్లో ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న గుండ లక్ష్మీదేవి అనుచరులు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడి ఇంటిని ముట్టడించారు. గుండ లక్ష్మీదేవి కాకుండా ఆ టికెట్‌పై ఎవరు పోటీ చేసినా తామంతా వ్యతిరేకంగా పని చేయాల్సి ఉంటుందని నినాదాలుచేశారు. అక్కడితో అయిపోదని... ఎంపీ సీటుపై కూడా ఎఫెక్ట్ పడుతుందని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న నేతలతో ఎంపీ రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) మాట్లాడారు. ఫోన్‌లో వారిని శాంతిపజేశారు. తాను టీడీపీ అధినేతతో మాట్లాడతామంటూ సర్ది చెప్పారు. ప్రస్తుతానికి ఈ విషయంలో నేతలు కాస్త వెనకడుగు వేసినా ఈ టికెట్ బీజేపీకి ఇస్తే మాత్రం సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు.
గుండ వర్సెస్ గొండు
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం(Srikakulam Assembly Constituency)లో రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో వర్గ పోరు నడుస్తోంది. గుండ లక్ష్మీదేవి(Gunda Laxmi Devi) వర్గం ఓవైపు గొండు వర్గం మరోవైపు హోరాహోరీగా తలపడుతున్నారు. టికెట్ కోసం ఇరు వర్గాలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అధినాయకత్వం నుంచి ఇద్దరికీ స్పష్టమైన హామీ రాలేదు. గతంలో ఓసారి విజయం సాధించిన గుండ లక్ష్మీ దేవి తమకు ఈసారి టికెట్ ఖాయంగా వస్తున్న చెబుతున్నారు. అయితే లక్ష్మీదేవికి టికెట్ ఇస్తే మాత్రం ఆమెకు సహకరించబోమంటూ గొండు వర్గం చెబుతోంది.
ఎంపీ ఇంటి ముందు ధర్నా
ఇరు వర్గాల మధ్య పోరును చూసిన టీడీపీ అధినాయకత్వం మధ్యే మార్గంగా ఇక్కడ టికెట్ బీజేపీకి ఇస్తే రెండు వర్గాలు సహకరిస్తాయని ఆలోచించింది. కానీ ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేశ్‌తోపాటు నాయకులు ఎంపీ నివాసాన్ని ముట్టడించారు. లక్ష్మీదేవికే టిక్కెట్ ఇవ్వాలని, బీజేపీకి కేటాయిస్తే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని హెచ్చరించారు.
అంగ, ఆర్థిక బలాలపై ఆరా
వైసీపీ నుంచి ధర్మాన ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఆయన్ని ఢీ కొట్టాలంటే అన్ని విధాలుగా బలమైన నాయకులు అవసరమని టీడీపీ భావిస్తోంది. అందుకే అక్కడ ఆర్థిక, అంగబలం ఉన్న వారి కోసం వెతుకుతోంది. ఈ విషయంలో గుండ, గొండు వర్గీయులు చేతులు ఎత్తేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఒక్క శాతం ఓటు బ్యాంకు లేని లేని బీజేపీకి శ్రీకాకుళం టిక్కెట్ ఇస్తే ఓటమి ఖాయమని టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మధ్యే టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎంపీ రామ్మోహన్నాయుడు కలిసి శ్రీకాకుళం అసెంబ్లీ సీటు విషయమై చర్చించినట్టు తెలిసింది. దీనిపై చంద్రబాబు ఓ క్లారిటీ కూడా ఇచ్చారట. అదేమిటన్నది బయటకు తెలియలేదు.
లక్ష్మీదేవి భావోద్వేగం
ఎంపీ ఇంటి వద్ద ఆందోళన చేసిన అనంతరం టీడీపీ శ్రేణులు అవరసవల్లిలోని గుండ నివాసానికి వెళ్లాయి. అక్కడ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవీని టీడీపీ నాయకులు కలిశారు. గుండ కుటుంబానికి టిక్కెట్టు ఇవ్వకపోతే పార్టీలో కొనసాగమని పలువురు చెప్పడంతో గుండ దంపతులు భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కంటతడి పెట్టారు. మాజీ మంత్రి గుండ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాలను పాటిస్తామన్నారు. తమ వెన్నంటే ఉన్న నాయకులు, కార్యకర్తలకు అప్పలసూర్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు.