శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం ఈసారికి ఎవరికి చిక్కేనో
Srikakulam Assembly Constituency: శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో శ్రీకాకుళం ఒకటి. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ వస్తున్నారు.
Srikakulam Assembly Constituency: శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో శ్రీకాకుళం ఒకటి. ఇక్కడ నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగడానికి ముందుకు కూడా ద్విసభ్య పేరుతో ఇక్కడ ఎన్నిక జరగ్గా, కెఎల్పీ నుంచి కె నారాయణ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి గుండ కుటుంబ సభ్యులే ఐదుసార్లు విజయం సాధించారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక్కడి నుంచి విజయం సాధించారు.
15 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు
ఏపీ అసెంబ్లీ ఏర్పాటు కావడానికి ముందే ఇక్కడ ఎన్నిక జరిగింది. దిసభ్య స్థానానికి జరిగిన ఎన్నికల్లో కేఎల్పీ నుంచి పోటీ చేసిన కె నారాయణ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె నరసయ్యపై విజయం సాధించారు. 1952లో ఏపీ అసెంబ్లీ ఏర్పాటైన తరువాత జరగిన తొలి ఎన్నికల్లో కేఎల్పీ నుంచి పోటీ చేసిన కెఏ నాయుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సమీప ప్రత్యర్థి టి పాపారావుపై 2664 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పి సూర్యనారాయణ ఇక్కడ విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జీఎస్ నాయుడిపై 2386 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏ తవిటయ్య విజయం దక్కించుకున్నారు. సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సూర్యనారాయణపై 1668 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టి సత్యనారాయణ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏ తవిటయ్యపై 9488 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సి లక్ష్మినారాయణ ఇక్కడ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టి సత్యనారాయణపై 2683 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన సి లక్ష్మినారాయణ ఇక్కడి నుంచి మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టి రాఘవదాస్‌పై 7087 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తంగి సత్యనారాయణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సి శ్యామలరావుపై 37,299 ఓట్ల తేడాతో గెలుపొందారు.
1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ అప్పల సూర్యనారాయణ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎం నరసనయ్యపై 38,597 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ అప్పల సూర్యనారాయణ మరోసారి ఇక్కడి నుంచి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన వి శేషగిరిరావుపై 5711 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి గుండ అప్పల సూర్యనారాయణ వరుసగా మూడోసారి ఇక్కడి నుంచి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏవీ నరసింహంపై 31,573 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1999లో జరిగిన ఎన్నికల్లోనూ గుండ అప్పల సూర్యనారాయణ వరుసగా నాలుగోసారి ఇక్కడి నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చల్లా రవి కుమార్‌పై 11,163 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ అప్పల సూర్యనారాయణపై 7227 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మరోసారి ధర్మాన ప్రసాదరావు విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ అప్పల సూర్యనారాయణపై 4127 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ లక్ష్మీదేవి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచిప ఓటీ చేసిన ధర్మాన ప్రసాదరావుపై 24,137 ఓట్ల తేడాతో ఆమె విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ లక్ష్మిదేవిపై 5777 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2,24,395 మంది ఓటర్లు
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2,24,395 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,12,490 మంది పురుషులు ఉండగా, 1,12,892 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుపొందే నియోజకవర్గాల్లో ఒకటిగా నిలుస్తూ వస్తోంది. టీడీపీ ఆవిర్భావం తరువాత తొమ్మిది ఎన్నికలు జరగ్గా, టీడీపీ ఆరుసార్లు ఇక్కడ విజయం సాధించింది. ఆరుసార్లులో టీడీపీ నుంచి గుండ కుటుంబ సభ్యులే ఐదుసార్లు విజయం దక్కించుకున్నారు. గుండ అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు గెలుపొందగా, రెండుసార్లు ఓటమి పాలయ్యారు. ఆయన భార్య గుండ లక్ష్మీదేవి ఒకసారి విజయం సాధించగా, మరోసారి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు, కేఎల్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు రెండుసార్లు విజయం దక్కించుకున్నారు. ఈ జిల్లాలో కీలక నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇక్కడి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. ఒకసారి ఓటమి చవి చూశారు.