Sajjala Comments : దాడులు పెరుగుతున్నాయి - తిరగబడితే తట్టుకోలేరు - టీడీపీకి సజ్జల హెచ్చరిక
Andhra News : వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని సజ్జల ఆరోపించారు. బైక్ ఢీకొనడంతో చనిపోయిన మంగళగిరి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అది హత్యగా ఆయన అభివర్ణించారు.
Elections 2024 : తెలుగుదేశం పార్టీ పదే పదే దాడులకు పాల్పడుతోందని.. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తుందని అప్రమత్తంగా ఉండాలని క్యాడర్‌కు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. మేకా వెంకటరెడ్డి అనే మంగళగిరి వైసీపీ కార్యకర్త బైక్ ఢీ కొనడంతో చనిపోయారు. ఆయనను బైక్‌తో ఢీ కొట్టి హత్య చేసింది టీడీపీ నేతలేనని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు మేకా వెంకటరెడ్డి మృతదేహానికి పార్టీ నేతలతో కలిసి వెళ్లి నివాళులు అర్పించారు.
వెంకటరెడ్డిని తిరిగి తీసుకురాలేమని, ఇలా జరగడం దారుణం అని అయితే కుటుంబసభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నీచమైన రాజకీయాలకోసం ఉన్మాదంతో ప్రవర్తిస్తోందని విమర్శించారు. ఎన్నికలలో టెర్రరైజ్ చేయాలని చూస్తోందని అన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న లోకేష్ ఓడిపోతాడని స్పష్టంగా తెలిసిపోవడంతో ఓటర్లను, వైయస్సార్ సిపి నాయకులను, సానుభూతిపరులను భయభ్రాంతులను చేసే ఉద్దేశ్యంతో కావాలని దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఇటీవల పదేపదే దాడులకు పాల్పడుతోంది. విజయవాడలో జగన్ పై హత్యాయత్నం చేశారు. అది మరచిపోకముందే మా పార్టీ ప్రచారంలో ఉన్న వెంకటరెడ్డి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి తెలుగుదేశం గూండాలు బైక్ తో గుద్ది దారుణంగా చంపేశారన్నారు.
బైక్ తో డీ కొట్టడం అనుకోకుండా జరిగిందనడానికి వీల్లేదని ఖచ్చితంగా దురుధ్దేశ్యంతోనే చేశారని అన్నారు. దీనిని పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు. మా పార్టీ బలమైన పార్టీ అయినప్పటికి తాము నిన్నటినుంచి చాలా సంయమనంతో ఉన్నామనేది అందరూ అర్ధం చేసుకోవాలన్నారు. నిగ్రహంతో ఉండటమనేది చేతకానితనంగా అర్దం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నామన్నారు. నిజంగా తమ పార్టీ వాళ్ళు కన్నెర్ర చేస్తే టిడిపి నేతలుగాని, కార్యకర్తలు గాని రోడ్లపై తిరగలేరన్నారు. ఇది పధ్దతి కాదన్నారు. ఇది ఖచ్చితంగా హత్య అని 302 కింద కేసు రిజిష్టర్ చేసి నిందితులను కఠినంగా శిక్షించేవిధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరుతున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివాటికి ఎవరు పాల్పడాలన్నా భయపడేవిధంగా శిక్షించాలని కోరారు.
వెంకటరెడ్డిని తిరిగి వెనకకు తీసుకురాలేమని అలాంటి మంచి నేతను కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలియచేశారు. పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా తగిన భరోసా ఇస్తున్నామని తెలియచేశారు. తెలుగుదేశం పార్టీ వారే హత్యలకు, దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడి తిరిగి వారే బాధితులం అన్నట్లు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. నిజానికి వైయస్సార్ సిపి వారే బాధితులుగా ఉంటున్నారని అన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారనే విషయం టిడిపి గుర్తుంచుకోవాలన్నారు. వీటన్నింటికి ఓటమి పాలు కాబోతున్నామనే నిసృహ ఇలాంటి పనులను టిడిపి చేత చేయిస్తోందని తెలియచేశారు. ముఖ్యమంత్రి పై దాడి చేసి తిరిగి డ్రామా అంటూ హేళన చేస్తూ మాట్లాడతున్నారని అన్నారు. సీఎంపై రాయితో దాడి చేసి ముఖ్యమంత్రిరే చేయించుకున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.