బీజేపీ కోసం సీఆర్పీఎఫ్ – టీఆర్ఎస్ కోసం పోలీసులు- మునుగోడులో బెంగాల్ ప్రయోగమంటూ రేవంత్ ఆరోపణలు !
Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీలు కలిసి మునుగోడు ఉపఎన్నికలో బెంగాల్ ప్రయోగం చేయబోతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోలీసులతో అల్లర్లు సృష్టించబోతున్నారని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Revanth Reddy: రాష్ట్రంలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలపై మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీపై టీఫీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ – బీజేపీ కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నాయని అన్నారు. అమిత్ షా ఆదేశాలతో సీఆర్పీఎఫ్ దిగబోతోందని పేర్కొన్నారు. బీజేపీ కోసం సీఆర్పీఎఫ్ – టీఆర్ఎస్ కోసం రాష్ట్ర పోలీసులు పని చేయబోతున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలు ఉద్రిక్తతలు సృష్టించి... రెండు పార్టీల ఎన్నికల పోలరైజేషన్ కోసం పని చేయబోతున్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఈ రెండు పార్టీల మధ్య పోలరైజేషన్ కు కుట్ర పన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.
'కేసీఆర్ సెంటిమెంట్ రాజేయబోతున్నారు'
కేసీఆర్ ఢిల్లీలో... మోడీ, షా ఉపదేశం తీసుకుని వస్తున్నారంటూ చెప్పుకొచ్చారు రేవంత్. ఎన్నికల సంఘ కార్యాలయం ముందు బైఠాయించి... సెంటిమెంట్ రాజేయబోతున్నారని వివరించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ముందు కూడా రఘునందన్, ఈటెలను ఉరేయబోతున్నట్టు హడావుడి చేశారని చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరు గెలిచాక వాళ్లపై కేసులు కాకులెత్తుకెళ్లాయని తెలిపారు. మునుగోడులో సైతం ఆ ఇద్దరి మధ్యనే పోలరైజేషన్ ఉందని... ఇద్దరూ కలిసే ఉద్రిక్తతలు సృష్టించి కుట్ర చేయబోతున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు, మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండి... ఈ కుట్రను తిప్పి కొట్టాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజ్యాంగ బద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. బ్యాలెట్ లో పేర్లు పొందుపరిచే విషయంలో.. మునుగోడు రిటర్నింగ్ అధికారి నాలుగో స్థానంలో ఉండాల్సిన టీఆరెస్ ను రెండో స్థానంలో ఉంచారని ఆరోపించారు. జాతీయ పార్టీల అభ్యర్థులు ముందుంచి తరువాత ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు పెట్టాలని తెలిపారు. టీఆర్ఎస్ ఇంకా జాతీయ పార్టీ కాలేదని... అభ్యర్థి టీఆర్ఎస్ తరఫునే నామినేషన్ వేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బ్యాలెట్ పేపర్ పై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ ను పరిశీలించి మార్పు చేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం సీరియల్ నెంబర్ కేటాయించాలని చెప్పారు. ఎన్నికల నియామవళి ప్రకారం అనుమతి లేని వాహనాలు సీజ్ చేయాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ర్యాలీల్లో అనుమతి లేని వాహనాలు తిరుగుతున్నారన్నారు.
'కేంద్ర ఎన్నికల సంఘం కళ్లు మూసుకుందా..? '
బహిరంగంగా అనుమతిలేని వాహనాలు తిరుగుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం కళ్లు మూసుకున్నట్లు వ్యవహరిస్తోందన్నారు. అందరికీ ఒకే రకమైన నియమావళిని అమలు చేయాలన్నారు. ఎన్నికల నిబంధనలు కేసీఆర్‌కు వర్తించవా? అని రేవంత్ రెడ్డి అడిగారు. మందు సరఫరా చేసిన మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మంత్రులు ప్రభుత్వ వాహనాలలో వచ్చి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇది నూటికి నూరు శాతం నిబంధనలకు విరుద్ధం అని అన్నారు. గ్రామాల్లో ఉన్న తమ కార్యకర్తలపై బీజేపీ వాళ్లు నిరంతరం దాడులు చేస్తున్నారని ఆరోపించారు. స్వయంగా రాజగోపాల్ రెడ్డీ తమ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎన్నికల అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.