Schemes for Women: టార్గెట్ ఉమెన్ ఓటర్స్: కాంగ్రెస్ పార్టీ ‘పంచ’ పథకాలు ప్రకటన
Nari Nyay guarantee Scheme: పార్లమెంటు ఎన్నికల్లో విజయం కోసం తపిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మహిళలను లక్ష్యం చేసుకుని సంచలన పథకాలనుప్రకటించింది.
Congress party NARI NYAY schemes: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో(Parliament Elections) విజయం కోసం తపిస్తున్న కాంగ్రెస్ పార్టీ(Congress party) తాజాగా మహిళలను లక్ష్యం చేసుకుని సంచలన `నారీ న్యాయ్`(NARI NYAY) పేరుతో పథకాలను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న మహిళల(Women)కు అందరికీ ఈ పథకాలను సంపూర్ణంగా అమలు చేస్తామని తెలిపింది. వీటిలో మహిళలకు ఏటా లక్ష రూపాయలు ఇచ్చే ఆర్థిక పథకం కూడా ఉండడం గమనార్హం.
దేశంలో ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం ఓటర్లు.. తాజా లెక్కల ప్రకారం 99.72 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 48.23 కోట్ల మంది మహిళలే ఉన్నారు. పైగా పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓపికగా నిలబడి ఓటు వేసేవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని అటు భారతీయ జనతా పార్టీ కూడా.. ఇప్పటికేపలు పథకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉజ్వల పథకం కింద.. గ్యాస్ సబ్సిడీని రూ.300 వరకు తగ్గించింది. అదేవిధంగా ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాధారణ గ్యాస్ కనెక్షన్లపైనా రూ.100 తగ్గింపు ఇచ్చింది. ఇక, నారీ సశక్తీ కరణ పేరిట కూడా కేంద్రం పథకలు ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకొనేందుకు పంచముఖ వ్యూహంతో ముందుకు రావడం గమనార్హం.
టార్గెట్ ఉమెన్!
మహిళలను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ.. పలు రాష్ట్రాల్లో ఇదే సెంటిమెంటు తో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలోనూ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం పేరుతో మెజారిటీ మహిళల అభిమానం పొందింది. కర్ణాటకలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగాలు చేసే మహిళలకు ఉచిత క్యాబ్ సౌకర్యం అందిస్తోంది. ఇప్పుడు ఇదే విధంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ వంటి బలమైన నాయకుడిని ఢీ కొట్టి నిలబడాలంటే.. మహిళల మద్దతు అవసరమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఆదిశగానే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్టుతెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మొత్తం 5( పంచ) కీలక పథకాలను ప్రకటించింది. ఇవి కేవలం దేశవ్యాప్తంగా మహిళలకు మాత్రమే ఉద్దేశించిన పథకాలుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పేర్కొన్నారు. ఈ పథకాలకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొత్త రిక్రూట్‌మెంట్ ప్రకారం నియామకాల్లో సగం హక్కు మహిళలకు ఉంటుందని పేర్కొన్నారు. `నారీ న్యాయ్` పేరుతో ఖర్గే ఈ హామీలను ప్రకటించారు.
ఇవీ పథకాలు..
1) మహాలక్ష్మి: పేదింటి మహిళకు ప్రతి ఏడాది రూ.1 లక్ష ఆర్థిక సాయం. ఈ నగదును ప్రతి ఏటా పేదల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని వెల్లడించింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా చేపట్టే నియామకాల్లో నారీమణులకు 50 శాతం కోటా ఇవ్వనున్నట్లు తెలిపింది.
2) ఆది అబది: కేంద్ర ప్రభుత్వంలో చేపట్టే నియామకాల్లో 50 శాతం మహిళలకు అవకాశం
3) శక్తి కా సమ్మాన్: ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు
4) అధికార్ మైత్రీ: న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో ఒక అధికార్ మైత్రి నియామకం
5) సావిత్రీబాయి పూలే హాస్టల్స్: ఉద్యోగం చేసే మహిళలకు రెట్టింపు హాస్టల్స్... ప్రతి జిల్లాలో కనీసం ఒక హాస్టల్ నిర్మాణం