Nara Bhuvaneshwari: చంద్రబాబు తరఫున నారా భువనేశ్వరి నామినేషన్ - కుప్పంలో టీడీపీ శ్రేణుల సందడి
Andhrapradesh News: టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో ఆర్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు.
Nara Bhuvaneshwari Filed Nomination On Behalf of Chandrbabu In Kuppam: రాష్ట్రంలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. తొలి రోజు పలువురు కీలక నేతలు ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో (Kuppam) రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకు ముందు భారీ ర్యాలీగా భువనేశ్వరి ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. దీంతో కుప్పం రోడ్లు జనసంద్రంగా మారాయి. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు. నామినేషన్ వేసే ముందు భువనేశ్వరి పలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బాబూనగర్ లోని చర్చిలో ప్రార్థనలు చేశారు.
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గారి తరపున నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో, భువనమ్మకి మద్దతుగా తరలి వచ్చిన కుప్పం ప్రజలు#BabuForJanaRajyam#NaraBhuvaneshwari #NaraChandrababuNaidu #TDPJSPBJPWinning #kuppam #AndhraPradesh pic.twitter.com/6UgRXdn7ib
— Telugu Desam Party (@JaiTDP) April 19, 2024
'రాక్షస పాలన అంతం చేయాలి'
రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదని.. ఓటు అనే వజ్రాయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ర్యాలీ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 'చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఆయన హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అంతా ముందుకొచ్చారు. ఇవాళ వైసీపీ హయాంలో పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి పోయాయి. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా వేధించారు. రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొద్దాం.' అని పేర్కొన్నారు.
బాలకృష్ణ నామినేషన్
అటు, హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కు వేస్తున్న సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక్కడ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా బాలకృష్ణ అన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. మా కుటుంబం అంటే హిందూపురం ప్రజలకు ఎంతో అభిమానం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించాం. గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చాం. అన్న క్యాంటీన్లను ప్రభుత్వం తొలగించినా హిందూపురంలో రోజుకు 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశాం.' అని పేర్కొన్నారు.