Pithapuram News: ముద్రగడపై కుమార్తె క్రాంతి ఫైర్- పేరు మార్పు ఛాలెంజ్, చేస్తున్న విమర్శలు నచ్చడం లేదని స్టేట్‌మెంట్
Mudragada Daughter Kranthi : ఎన్నికల తర్వాత ముద్రగడ పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు ఆయన కుమార్తె క్రాంతి. పవన్ ను విమర్శించడంపై ఆమె ఫైర్ అయ్యారు. పేరు మార్పు ఛాలెంజ్‌పై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముద్రగడ పద్మనాభానికి సొంతింటిలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పదేపదే పవన్ కల్యాణ్‌ను తిట్టడంపై ముద్రగడ కుమార్తె క్రాంతి తప్పుపట్టారు. ఆయన్ని తిట్టడానికే ముద్రగడను వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకున్నట్టు ఉందని ఆరోపించారు. పూర్తిగా దాని కోసమే వైసీపీ వాడుకుంటోందని ఫైర్ అయ్యారు.
ముద్రగడ చేస్తున్న కామెంట్స్‌ను ఖండించిన కుమార్తె క్రాంతి... పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. ఆమె పేరుతో ఓ రికార్డెడ్ వీడియోను వీడుదల చేశారు. అందులో ఏమన్నారంటే...."పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి వైసీపీ వాళ్లు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు." అని విమర్శించారు.
ముద్రగడ చేసిన ఛాలెంజ్ ఆశ్చర్యం కలిగించింది అన్నారు క్రాంతి. ఇది తమ ఫ్యామిలీకే కాదని ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదని అన్నారు. "ముఖ్యంగా మా నాన్న చాలా బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్‌ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు."
రాజకీయాల్లో విమర్శలు చేయవచ్చని... ఒకరి విజయం కోసం పని చేయవచ్చన్న క్రాంతి... వేరే వ్యక్తులను వారి అనుచరులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని సూచించారు. ఇప్పుడు ముద్రగడ చేస్తున్నది అదేనంటూ ధ్వజమెత్తారు. "వంగ గీతను గెలిపించడానికి కష్టపడొచ్చు. కానీ పవన్ కల్యాణ్‌ను ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు."
ఈ ఎన్నికల తర్వాత కచ్చితంగా ముద్రగడను వైసీపీ వాళ్లు వదిలేస్తారని జోస్యం చెప్పారు క్రాంతి. ఆయన్ని ఎటూ కాకుండా పోతారని అన్నారు. కేవలం పవన్‌ను తిట్టడానికే ముద్రగడను పరిమితం చేస్తున్నారని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వివరించారు. "మా నాన్న గారిని కేవలం పవన్ కల్యాణ్‌ను తిట్టడం కోసమే జగన్ మోహన్ రెడ్డి వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయన్ని ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. పవన్ కల్యాణ్ విజయం కోసం నా వంతు కృష్టి నేను చేస్తాను. " అని క్రాంతి పేర్కొన్నారు.