MLA Pinnelli arrest : సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ ? ఏపీకి తరలించే చాన్స్
Andhra News : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సంగారెడ్డి సమీపంలో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుల్ని అరెస్ట్ చేసి ఐదు గంటల కల్లా నివేదిక పంపాలని ఈసీ ఆదేశించింది.
Elections 2024 : పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి సమీపంలో ఓ పరిశ్రమలో తలదాచుకున్న ఆయనను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఏపీకి తరలించి ఆ తర్వాత అరెస్టు విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ వన్ గా ఉన్నారు. ఆయన ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు వైరల్ కావడం.. ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదమయింది.
తక్షణం చర్యలు తీసుకుని నివేదిక పంపాలని ఆదేశించిన సీఈసీ
దేశ వ్యాప్తంగా ఈవీఎంల ధ్వంసం వీడియో వైరల్ కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. రాష్ట్ర సీఈవోకు నోటీసులు పంపింది. సాయంత్రం ఐదు గంటలలోపు నిందితులను అరెస్టు చేసి నివేదిక పంపాలని ఆదేశించింది. పిన్నెల్లిని అరెస్టు చేయకపోతే పోలీసు వ్యవస్థ విఫలమైనందన్న తీవ్ర విమర్శలు వస్తాయి. గృహనిర్బంధంలో ఉన్న పిన్నెల్లి పోలీసులకు తెలియకుండానే హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయనపై చర్యలు తీసుకోలేదు. వీడియో విడుదలైన తర్వాతనే అరెస్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
అరెస్టును తప్పించుకునేందుకు ప్రయత్నించిన పిన్నెల్లి
అరెస్టు కాకుండా ఉండేందుకు పిన్నెల్లి చాలా ప్రయత్నాలు చేశారు. మొదటగా ఆయన సంగారెడ్డి వైపు వెళ్తున్నసమయంలో పోలీసులకు సమాచారం లభించింది. ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఏపీ పోలీసులు సంగారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పిన్నెల్లి మధ్యలో వేరే వాహనంలోకి మారి వెళ్లిపోయారు. దీంతో పిన్నెల్లి వాహనాలను సంగారెడ్డి సమీపంలోని కంది పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే ఎటు వైపు పారిపోయారో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరికి ఆయన ఓ పరిశ్రమ గోడౌన్ లో ఉండగా కనిపెట్టి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పది సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో కేసులు పెట్టారు ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు కూడా నమోదు చేశారు. పిన్నెల్లిపై ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలను ద్వంసం చేస్తే అందులో ఏడు ఘటనలు మాచర్లలోనే జరిగాయి. ఏడింటిలోనూ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఫుటేజీలన్నిటినీ ప్రత్యేక దర్యాప్తు బృందాలకు పోలీసులు అందించారు.