Maharashtra Assembly Election Results 2024: నవంబర్ 26న కొలువుదీరనున్న మహారాష్ట్ర ప్రభుత్వం- సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్
Maharashtra Election Results 2024: భారీ విజయాన్ని అందుకున్న మహాయుతి మహారాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఆదివారం శాసనసభా పక్షం సమావేశం కానుంది.
Maharashtra Assembly Election Results 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి తిరుగులేని విజయం సాధించింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఆదివారం(నవంబర్ 23)నాడు మహాయుతి శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఆ సమావేశంలో శాసనసభా పక్ష నేతలను ఎన్నుకుంటారు. అనంతర ఆయనతో నవంబర్ 26వ తేదీన ప్రమాణం చేయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మంగళవారం నాడు మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం కొలువదీరబోతోంది.
రేపు ఎల్పీ సమావేశం
మహాయుతి తరఫున సీఎంగా ఎవరు కూర్చుంటారనే చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. షిండే నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తున్నామని నోటిఫికేషన్‌కు ముందే బీజేపీ ప్రకటించింది. అయితే ఫలితాల్లో బీజేపీ దుమ్ము రేపింది. భారీ స్థాయిలో సీట్లు కొల్లగొట్టింది. దీంతో ఆ పార్టీ నాయకత్వం ఆలోచనలో మార్పు వచ్చిందని చర్చించుకుంటున్నారు. దేవేందర్ ఫడ్నవీస్‌ను సీఎంగా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో వారు ఉన్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Also Read: మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ -బీజేపీ సునామీతో మారిపోనున్న లెక్కలు!
ఇదే విషయంపై డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ స్పందించారు. పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని ఇప్పుడే ఓ అంచనాకు రావడం మంచిది కాదని అంటున్నారు. మూడు పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో తీసుకోవాల్సిన నిర్ణయమని అన్నారు.
బీజేపీ భారీ స్ట్రైక్ రేట్
మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ స్ట్రైక్ రేట్‌తో విజయం అందుకుంది. దాదాపు 84 శాతం స్ట్రైక్ రేట్‌తో సీఎం రేసులోకి వచ్చింది. రెండో స్థానంలో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యమైన ఈ విజయాన్ని పార్టీ నేతలే ఊహించలేదని అంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ 131 సీట్లలో ఆధిక్యంలో ఉంది. షిండే నాయకత్వం వహించే శివసేన 48 స్థానాల్లో అజిత్ పవార్ నేతృత్వంలోనే NCP 31 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ 35, ఉద్దవ్ ఠాక్రే శివసేన 20, శరద్‌పవార్ NCP 10 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల్లో BJP స్ట్రైక్ రేట్ - 84%
మహారాష్ట్ర ఎన్నికల్లో NCP (Ajit Pawar) స్ట్రైక్ రేట్ - 62%
మహారాష్ట్ర ఎన్నికల్లో Shiv Sena (Shinde) స్ట్రైక్ రేట్ - 71%
మహారాష్ట్ర ఎన్నికల్లో Congress స్ట్రైక్ రేట్ - 19%
మహారాష్ట్ర ఎన్నికల్లో Shiv Sena (Uddhav Thackeray) స్ట్రైక్ రేట్ - 21%
మహారాష్ట్ర ఎన్నికల్లో NCP (Sharad Pawar) స్ట్రైక్ రేట్ - 12
బీజేపీకి ఈ ఫలితాలు ఆల్‌టైం రికార్డు
మహారాష్ట్రలో బీజేపీ ఆల్ టైమ్ హై రికార్డు దిశగా దూసుకుపోతోంది. బీజేపీ 131 స్థానాల్లో, శివసేన (షిండే) 48, ఎన్సీపీ (అజిత్ పవార్) 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 35 స్థానాల్లో, శివసేన (ఉద్ధవ్) 20 స్థానాల్లో, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 2014లో మహారాష్ట్రలో బీజేపీ 122 సీట్లు గెలుచుకుంది.
మహారాష్ట్రలో మహాయుతి 220 స్థానాల్లో ఆధిక్యం
మహారాష్ట్రలో మహాయుతి 220 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి కేవలం 55 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
Also Read: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు