General Election Results 2024: నేడే ఓట్ల లెక్కింపు: దేశమంతా ఎన్ని కోట్ల మంది సిబ్బంది పని చేస్తున్నారో తెలుసా?
Lok Sabha Election Results 2024: అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 2024 సార్వత్రిక ఎన్నికల కోసం 1.5 కోట్ల మంది ఎన్నికల సిబ్బంది పని చేస్తున్నారని కేంద్ర ఎన్నికల కమిషనర్ చెప్పారు.
General Election Counting News: దేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో మొదలు కానుంది. అన్ని రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేల కొద్దీ కౌంటింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం (జూన్ 3) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్లు రికార్డు నెలకొల్పారని అన్నారు. ఈ సారి 64.2 కోట్ల మంది మన దేశంలో ఓటు వేశారని.. ఇదొక ప్రపంచ రికార్డు అని అన్నారు. వీరిలో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని అన్నారు.
దాదాపు 68 వేల మంది పర్యవేక్షక టీమ్‌లు కౌంటింగ్ ప్రక్రియను దేశ వ్యాప్తంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 2024 సార్వత్రిక ఎన్నికల కోసం 1.5 కోట్ల మంది ఎన్నికల సిబ్బంది పని చేస్తున్నారని చెప్పారు.
సాధారణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ స్థానాలకు కూడా కౌంటింగ్ నేడు (జూన్ 4) జరగనుంది. ‘‘ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది. అరగటంలోనే అది పూర్తయిపోతుంది. తర్వాత ఈవీఎం లెక్కింపు మొదలవుతుంది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు సహా సమస్యాత్మక కేంద్రాల్లో మూడంచెల భద్రతా బలగాలను మోహరించారు.
ఏడు దశల్లో ఎన్నికలు
2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదటి దశ ఏప్రిల్ 19న ప్రారంభమైంది. తర్వాత రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో విడత ఎన్నికలు మే 25న, ఏడో దశ జూన్ 1న జరిగాయి. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా వీటి ఫలితాలు జూన్ 2న విడుదలయ్యాయి.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.