Delhi Election Result 2025: జైలుకెళ్తే సీఎం అనే సెంటిమెంట్ బ్రేక్ - కనీసం ఎమ్మెల్యేల్ని కూడా చేయని ఢిల్లీ ప్రజలు !
Delhi: ఢిల్లీలో జైలుకెళ్లిన నేతలు ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేదు. ఢిల్లీ సీఎం అతిశీ మాత్రం అతికష్టం మీద గెలిచారు.

Delhi Election 2025: ఎవరైనా ప్రముఖ రాజకీయ నాయకుడు జైలుకు వెళ్తే అతనికి సీఎం యోగం ఉంటుందన్న ఓ సెంటిమెంట్ రాజకీయాల్లో ఉంది. జగన్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, హేమంత్ సోరెన్ ఇలా చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చేవి. అలాగే కేజ్రీవాల్ కూడా మరోసారి సీఎం అవుతారని అనుకున్నారు. కానీ ఢిల్లీ ప్రజలు సెంటిమెంట్ ను బద్దలు కొట్టారు. సీఎం కాదు కదా.. కనీసం ఎమ్మెల్యేగా కూడా కేజ్రీవాల్ ను గెలిపించలేదు.
జైలుకెళ్లిన ఆప్ ముగ్గురు నేతలపై ఓటర్ల ఆగ్రహం
ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలందర్నీ చట్టసభలకు రానివ్వకుండా చేశారు ఢిల్లీ ఓటర్లు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా వచ్చిన క్రేజ్ తో ఢిల్లీ లో తిరుగులేని నేతగా ఉన్న షీలాదీక్షిత్‌ను న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఓడించిన అరవింద్ కేజ్రీవాల్ మాజీ సీఎం కుమారుడి చేతిలో పరాజయం పాలయ్యారు. సీనియర్ బీజేపీ నేత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పర్వేశ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ పన్నెండు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు. చాలా కాలం అకారణంగా జైల్లో పెట్టారని.. తనను జైల్లో పెట్టిన వారిని శిక్షించాలని.. ఓటుతో బుద్ది చెప్పాలని ఆయన కోరుకున్నారు. కానీ ప్రజలు ఆయననే శిక్షించారు. కనీసం చట్టసభ సభ్యునిగా కూడా గెలిపించలేదు.
జైలుకెళ్లిన ఇతర సీనియర్ నేతలూ ఓటమి
ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అతిశీ అతి కష్టం మీద విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరీని హోరాహోరీగా పోరులో ఓడించారు. కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తే డిప్యూటీ సీఎం ఢిల్లీని పరిపాలించిన మనీష్ సిసోడియా కూడా పరాజయం పాలయ్యారు. జంగ్ పురాలో స్వల్ప ఓట్ల తేడాతో సిసోడియా బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. సిసోడియా కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలో చాలా కాలం జైల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవిని కూడా ఈ కారణంగా కోల్పోవాల్సి వచ్చింది. ఢిల్లీలో స్కూళ్లకు ఓ రూపు తీసుకు వచ్చి పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తెచ్చానని సిసోడియా ఎంత చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. సిసోడియా జైలుకెళ్లిన తర్వాత రాజీనామా చేశారు. సిసోడియా జైలు నుంచి వచ్చిన తర్వాత పదవి చేపట్టలేదు. అయినా ఓడిపోయారు. ఇక మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన మరో నేత సత్యేందర్ జైన్ కూడా ఓడిపోయారు. ఆయన కూడా చాలా కాలం జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్ని ప్రజలు తిరస్కరించారు.
ఆప్ ఆగ్రనేతలంతా ఓటమి !
ఆమ్ ఆద్మీ పార్టీలో పెత్తనం చేసిన పెద్దలంతా దాదాపుగా అంతా ఓడిపోయారు. ఇది ఆ పార్టీ కి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. స్వయంగా కేజ్రీవాల్ ఓడిపోవడం అంటే ప్రజల్లో ఆయన పలుకుబడి పూర్తిగా మందగించినట్లే అనుకోవచ్చు. తాను అవినీతి చేయలేదని నమ్మితే ఓటుతో మద్దతివ్వండి కేజ్రీవాల్ చేసిన ప్రచారం.. తేడా కొట్టింది. ఇప్పుడు ఆయన అవినీతి చేసినట్లుగా ప్రజలు నమ్మినట్లయింది. అవినీతి కేసుల్లో జైలుకెళ్తే ప్రజలు సహరించే పరిస్థితి లేదని అది రాజకీయ కక్ష సాధింపు అని నమ్మకపోతే.. మొత్తానికే తేడా వస్తుందని ఢిల్లీ ఫలితాలు నిరూపించాయంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

