karnataka elections 2023: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా భజరంగ్ దళ్ నిరసన, మేనిఫెస్టో కాపీలు దగ్ధం
karnataka elections 2023: కర్ణాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల పేర్కొనడంపై వివాదం కొనసాగుతోంది.
karnataka elections 2023: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంపై ఆ సంస్థ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. హామీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ, కర్ణాటకలోని మంగళూరులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం దగ్గర బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీలను దగ్ధం చేసి, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది?
అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్, పీఎఫ్‌ఐ వంటి సంస్థలను నిషేధిస్తామని మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. కులం లేదా మతం ప్రాతిపదికన వర్గాల మధ్య విద్వేషాలను వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై బలమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని నేతలు హామీ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా నిరసనలు
బజరంగ్ దళ్ అనేది ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) యువజన విభాగం. బజరంగ్‌దళ్ దేశానికి గర్వకారణమని, కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను మార్చకుంటే దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని వీహెచ్‌పీ నేతలు ఢిల్లీలో నిరసన తెలిపారు.
పీఎఫ్ఐ బజరంగ్ దళ్‌కు పోలిక దురదృష్టకరం
వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాన్ని బజరంగ్ దళ్ సవాల్‌గా తీసుకుంటుందని, పార్టీకి ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం ఇస్తుందని అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల సందర్భంగా.. జాతీయవాద సంస్థ బజరంగ్‌దళ్‌ను దేశ వ్యతిరేక, ఉగ్రవాద, నిషేధిత సంస్థ పీఎఫ్‌ఐతో పోల్చిన తీరు దురదృష్టకరమని తెలిపారు. బజరంగ్ దళ్‌లోని ప్రతి సభ్యుడు దేశానికి, సమాజానికి సేవ చేయడానికి అంకితభావంతో ఉన్నారని జైన్ పేర్కొన్నారు.
ఓట్ల కోసం మా ఇళ్లకు రావద్దు
కాంగ్రెస్ హామీపై బజరంగ్ దళ్ నాయకులు మండిపడుతున్నారు. తమ ఇళ్ల బయట కాంగ్రెస్‌కు హెచ్చరికలు చేస్తూ పోస్టర్లు అంటించారు. చిక్కమగళూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బజరంగ్ దళ్ జెండాలతో కూడిన భవనాలపై ఇలాంటి పోస్టర్లు కనిపించాయి. ఈ నెల 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లకు రావద్దని పోస్టర్‌లో హెచ్చరించారు. పోస్టర్‌పై ‘ఇది బజరంగ్ దళ్ కార్యకర్త ఇల్లు.. ఓట్లు అడిగేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారెవరూ లోపలికి రాకూడదు.. అయినా లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తే కుక్కలు చింపిన విస్తరి’ అని రాసి ఉంది.
కాంగ్రెస్ హనుమంతుడిని అవమానించింది
అదే సమయంలో, కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటూ, అధికార బీజేపీ విమర్శలు గుప్పించింది. కర్ణాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తానని హామీ ఇవ్వడం హనుమంతుడిని అవమానించడమేనని పేర్కొంది. ఇది నిషేధించిన పాపులర్ ఫ్రంట్‌ను 'రక్షించే' ప్రయత్నమని ఆరోపించింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ చరిత్రను, ఆలోచనలను కర్ణాటక ప్రజలు ఎన్నటికీ మరువకూడదని చెప్పారు. టెర్రరిస్టులను పెంచిపోషించడం కాంగ్రెస్‌కు అలవాటు అని.. ఢిల్లీలో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు ఉగ్రవాదులు హతమయ్యారనే వార్త విని కాంగ్రెస్ అగ్రనేత కళ్లలో నీళ్లు తిరిగాయని విమర్శించారు.