Sharmila Vs Avinash Reddy: అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
Telugu News: వైఎస్ వివేక హత్య కేసులో తమ తప్పులేదని తెలిసే రోజు వస్తుందని ఆ రోజు కచ్చితంగా షర్మిల, సునీత క్షమాపణలు చెబుతారన్నారు అవినాష్ రెడ్డి.
Andhra Pradesh News: తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, డాక్టర్ సునీత క్షమాపణలు చెప్పే రోజు కచ్చితంగా వస్తుందన్నారు వైసీపీ తరఫున కడపలో పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి. వివేక హత్య కేసులో పొద్దస్తమానం నోటికి వచ్చినట్టు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి చేసిన కామెంట్స్ వింటూ ఉంటే కోపం రావడం లేదన్న అవినాష్ బాధేస్తోందని అన్నారు.
కడప ప్రచారంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి... వైఎస్ ఉన్నంతర కాలం పోరాడిన వ్యక్తులతోనే తన అక్కలు సునీత, షర్మిల చేతులు కలిపి జగన్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులతో పోరాడే శక్తిని ప్రజలకే ఇస్తారని అన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా చంద్రబాబు విజయం కోసం షర్మిలకు టాస్క్ ఇచ్చారని ఆరోపించారు.
2019లో వివేక హత్య కేసు జరిగితే... 2021 వరకు ఎవరూ మాట్లాడింది లేదని తర్వాత కుట్రలు మొదలయ్యాయని అన్నారు. తానే చంపానని చెప్పుకుంటున్న దస్తగిరికి అంతా మద్దతు ప్రకటిస్తున్నారని... వాచ్‌మెన్ రంగన్న కూడా ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. తప్పుడు ప్రచారంలో తనను మాత్రం ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు.
ఎలాంటి తప్పు చేయకపోయినా తనను తన ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు అవినాష్. అందరి వాడుగా ఉండే భాస్కర్‌రెడ్డి లాంటి వ్యక్తిని కూడా జైల్లో పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పులేకపోయినా కేసులతో ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. అయితే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన కచ్చితంగా నిలబడతానన్నారు. కచ్చితంగా ప్రజలు మద్దతు ఉంటుందని అభిప్రాయపడ్డారు. తామంతా నిర్దోషులమని తెలిసే రోజు ఒకటి ఉంటుందన్నారు. ఇప్పుడు తిట్టిన వాళ్లే ఆ రోజు వచ్చి క్షమాపణలు చెప్పాలని అది తను వినాలని అన్నారు.