Pithapuram Sitcker War: 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' - స్టిక్కర్ల వార్ షురూ, ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు!
AP Elections 2024: ఎన్నికల ఫలితాలు తేలకముందే పిఠాపురంలో స్టిక్కర్ల వార్ షురూ అయ్యింది. అటు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఇటు వంగా గీత అభిమానులు 'మా ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ స్టిక్కర్లతో హల్చల్ చేస్తున్నారు.
Sitckers War In Pithapuram: జూన్ 4.. కౌంటింగ్ డే. అంతటా ఒకటే ఉత్కంఠ. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?. 'జగనే మళ్లీ సీఎం' అంటూ వైసీపీ నేతలు, శ్రేణులు ప్రమాణస్వీకారానికి ముహూర్తం సైతం ఫిక్స్ చేశారు. అటు, కూటమి శ్రేణులు సైతం విజయం తమదే అని.. చంద్రబాబు (Chandrababu) సీఎం అవుతారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రమంతా ఫలితాలు ఒక ఎత్తైతే.. పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం మరో ఎత్తు. ఎందుకంటే ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బరిలో నిలవడమే. వైసీపీ తరఫున వంగాగీత (Vanga Geetha) పోటీ చేశారు. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇరు పార్టీల ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఫలితాలు రాక ముందే తమ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యే అంటూ హోరెత్తిస్తున్నారు.
స్టిక్కర్ల వార్ షురూ
ఎన్నికల కౌంటింగ్ కు ముందే కోనసీమ (Konaseema), కాకినాడ (Kakinada) జిల్లాల్లో స్టిక్కర్ల వార్ షురూ అయ్యింది. 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతుదారులు తమ బైక్స్ వెనుక స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. మొబైల్ ఫోన్లపై, వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేస్తున్నారు. అటు, వైసీపీ శ్రేణులు, వంగా గీత అభిమానులు సైతం 'డిప్యూటీ సీఎం గారి తాలూకా' అంటూ స్టిక్కర్లు పెడుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే ఆమెను డిప్యూటీ సీఎంను చేస్తానని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతో 'డిప్యూటీ సీఎం గారి తాలూకా' అంటూ బైక్స్, మొబైల్స్ పై స్టిక్కర్లు హల్ చల్ చేస్తున్నాయి. అటు, సోషల్ మీడియాలో ఈ స్టిక్కర్లు వైరల్ గా మారాయి.
ఎందుకంత క్రేజ్.?
రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురానికి ఎందుకంతే క్రేజ్ అంటే పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. ఈసారి టీడీపీ, బీజేపీతో కలిసి కేవలం పిఠాపురం నుంచే బరిలో నిలిచారు. అందుకు అనుగుణంగానే పక్కా ప్రణాళికతో సభలు, రోడ్ షోలు నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. ప్రచారాన్ని హోరెత్తించారు. పవన్ కల్యాణ్ ఈసారి కచ్చితంగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడతారని జనసేన శ్రేణులు, ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే కౌంటింగ్ కు ముందే తెగ హడావుడి చేస్తున్నారు. అటు, వైసీపీ శ్రేణులు కూడా వీరికి ఏమాత్రం తగ్గకుండా వంగా గీతదే విజయం అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. వీరి మెజార్టీపై కూడా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
భారీగా బెట్టింగులు.?
మరోవైపు, ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్, చంద్రబాబు మెజార్టీపైనా బెట్టింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. అటు, పిఠాపురంలోనూ గెలుపోటములు, మెజార్టీపైనా ఎక్కువగా బెట్టింగ్ జరుగుతోందని తెలుస్తోంది.
కాగా, స్టిక్కర్ల వార్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఫలితం తేలకముందే ఇలా ఎవరికి వారు పోస్టులు పెట్టడం సరికాదని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవరిది గెలుపు అనేది తెలియాలంటే జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే.
Also Read: CM Jagan: వివాదాలు విప్లవాత్మక నిర్ణయాలు- జగన్ సర్కార్‌కు ఐదేళ్లు- సరిగ్గా ఇదే రోజు సీఎంగా ప్రమాణం