Jammu Kashmir Election: జమ్ముకశ్మీర్‌లో కొలిక్కి వచ్చిన ఇండి కూటమి పొత్తులు - అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు
Jammu Kashmir Assembly Election: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.
Congress, NCP And BJP List For Jammu Kashmir Election: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో వెళ్తున్నాయి. కచ్చితంగా ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పాగా వేయాలని ఓవైపు బీజేపీ ప్లాన్ చేస్తుంటే అందుకు ప్రతివ్యూహంగా ఇడీ కూటమి ఎత్తులు వేస్తోంది. ఈ మేరకు సోమవారం కీలక నేతలు సమావేశమై పొత్తులు కుదుర్చుకున్నారు.
పొత్తులు కుదిరాయ్- సీట్లు సర్దుబాటు అయ్యాయి
మొత్తం 90 స్థానాలు ఉన్న జమ్ముకశ్మీర్‌లో ఇండి కూటమి మధ్య సీట్ల పంపకం పూర్తైంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున ఎలాంటి హడావిడి లేకుండా చాలా సాఫీగా సీట్ల సర్దుబాటు చేసుకున్నాయీ పార్టీలు. 90 స్థానాల్లో 50 సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేయనుంది. 32 సీట్లలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టనుంది. సీపీఐ(ఎం), జమ్మూ కాశ్మీర్ పాంథర్స్ పార్టీ చెరో స్థానంలో పోటీ చేస్తాయి. మరో ఆరు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుంది. బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది.
తొలి జాబితాను ప్రకటించిన పార్టీలు
మరోవైపు 16 మంది అభ్యర్థులతో బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ 18 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. సోమవారం (ఆగస్టు 26) 16 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది.
కాంగ్రెస్ 9 మందితో తొలి జాబితా విడుదల
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 9 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. డోరు నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్‌మీర్, బనిహాల్ నుంచి వికార్ రసూల్ వనీకి టిక్కెట్ దక్కింది. ట్రాల్ నుంచి సురీందర్ సింగ్ చన్నీ, దేవ్‌సర్ నుంచి అమానుల్లా మంతూ, అనంత్‌నాగ్ నుంచి పీర్జాదా మహ్మద్ సయీద్, ఇందర్‌వాల్ నుంచి షేక్ జఫరుల్లా, భదర్వా నుంచి నదీమ్ షరీఫ్, దోడా నుంచి షేక్ రియాజ్, దోడా వెస్ట్ నుంచి ప్రదీప్ కుమార్ భగత్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయగా, 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ 9 మందిలో ఏడుగురు ముస్లింలు ఉన్నారు.
కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ 18 స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఇందులో 16 మంది అభ్యర్థులు ముస్లిం వర్గానికి చెందినవారే. బీజేపీ విడుదల చేసిన 16 మంది జాబితాలో 10 మంది ముస్లిం వర్గానికి చెందినవారు.
Also Read: సౌత్ ఇండియాలో పాగా వేసేందుకు వ్యూహం మార్చిన బీజేపీ