Fact Check: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో టెలీప్రాంప్టర్ వాడుతున్నారా?
Jagan News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల ప్రచారంలో టెలీప్రాంప్టర్ వాడుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజం?
Fact Check: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నౌ ఆర్ నెవర్ అన్నట్టు అధికార ప్రతిపక్షాలు సమరక్షేత్రంలో పోరాడుతున్నాయి. మాటల తూటాలు పేలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూనే ఆన్‌లైన్‌లో కూడా అంతకు మించి అన్నట్టు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో కొంత తప్పుడు ప్రచారం కూడా సాగుతోంది. అలాంటి వాటిలో ఒకటే సీఎం జగన్ మోహన్ రెడ్డి టెలీప్రాంప్టర్‌లో చూస్తూ చదువుతున్నారనే ప్రచారం.
జగన్ ఇన్నాళ్లూ బస్సు యాత్ర ద్వారా మొన్నటి వరకు ప్రజలకు దగ్గరయ్యారు. శనివారం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. రోజుకు మూడు నాలుగు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తూనే వచ్చే ఐదేళ్లు ఏం చేయబోతున్నారో చెబుతున్నారు. అదే టైంలో ప్రత్యర్థులపై కూడా విమర్శలు చేస్తున్నారు.
ఇలా సభల్లో పాల్గొంటున్న జగన్ మోహన్ రెడ్డి చూసి చదువుతున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పుడు దీని కోసం ఏకంగా టెలీ ప్రాంప్టర్‌ను ఏర్పాటు చేసుకున్నారని ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఏబీపీ దేశం ఫ్యాక్ట్ చెక్ చేస్తే అలాంటిదేమీ లేదని తేలింది.
ప్రజలతో మాట్లాడేటైంలో చాలా మంది నేతలు కొంత సమాచారాన్ని తన వద్ద ఉంచుకుంటారు. ఇప్పుడు జగన్ కూడా తన ప్రచారంలో ప్రస్తావించేందుకు సమాచారం పేపర్‌లను తన వద్ద ఉంచుకుంటున్నారు. తమ పాలనలో ప్రజలకు చేసిన మేలును వివరిస్తున్నారు. అందుకోసం కొన్నిపేపర్‌లను ముందు పెట్టుకొని ప్రసంగిస్తున్నారు. అలా చేయడం వల్ల అది టెలీ ప్రాంప్టర్ల్‌లా కనిపిస్తుంది.
#WATCH | YSRCP chief and Andhra Pradesh CM YS Jagan Mohan Reddy addressed a public meeting in Anakapalle.
— ANI (@ANI) April 29, 2024
(Source: YSRCP) pic.twitter.com/G5TJskPvws
జగన్ మాట్లాడే సమయంలో ఆయన కళ్ల ముందు ఉంటున్నది టెలీప్రాంప్టర్ కాదు. అది పేపర్‌లతో కూడిన బల్ల. అక్కడ గాలికి ఎగురుతున్న పేపర్లను కూడా చూడవచ్చు. పదే పదే పేపర్‌లను తిరగేస్తున్న విషయాన్ని కూడా గమనించవచ్చు. అందుకే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఆయన టెలీప్రాంప్టర్ చూసి చదవడం లేదు. సమాచారం కోసం ఓ ప్యాడ్ మీద పెట్టుకున్న పేపర్లు అవి.
This story was originally published by ABP Desam as part of the Shakti Collective.