(Source: ECI/ABP News/ABP Majha)
Godavari News: ఈసారి గోదావరి దాటి అమరావతి చేరేది ఎవరు?
Andhra Pradesh News: ఉభయగోదావరి జిల్లాల్లో ఎవరిది పైచేయి సాధిస్తే...రాష్ట్రంలో వాళ్లే గద్దెనెక్కుతారని నానుడి. అందుకే ఎన్డీఏ కూటమి, వైసీపీ తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి
Godavari News: గోదావరిని క్షేమంగా అవతలి ఒడ్డుకు దాటేస్తే... విజయలక్ష్మీని అడ్డుకునే వాళ్లెవరూ ఉండరనేది గోదావరి(Godavari) జిల్లాలో తరుచూ వినే మాట. అది రాజకీయాలకూ వర్తిస్తుందని పలుమార్లు రుజువైంది. గోదావరిలో గెలిచిన పార్టీయే అధికారపీఠం ఎక్కుతుందనేది జనమెరిగిన సత్యం. అందుకే అన్ని రాజకీయ పార్టీలు గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కిరావడంతో కీలక నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారు.
తూర్పుగోదావరి దారెటు...
రాష్ట్రంలో ఎవరు గద్దెనెక్కాలి..ఎవరు దిగిపోవాలని డిసైడ్ చేసే కీ ఓట్లు, సీట్లు ఉన్న గోదావరి జిల్లాల్లోనూ ఈసారి గాలి ఎటు తిరుగుంతో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అత్యంత కీలక నేతలంతా ఈ రెండు జిల్లాల్లోనూ ఉండటం విశేషం. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి నేతలు గోడలు దూకడం సహజం. కానీ ఈసారి జనసేన, బీజేపీ సైతం తెలుగుదేశంతో కూటమికట్టి బరిలో దిగడంతో.... రాజకీయం రసవత్తరంగా మారింది.
పిఠాపురంపై అందరి దృష్టి
ఉమ్మడి జిల్లాల ప్రజలే గాక...రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం(Pithapuram)పైనే పడింది. ఎందుకంటే అక్కడి నుంచి జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) పోటీలో ఉండటమే. తొలుత ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా...చివరకు పిఠాపురం నుంచి అసెంబ్లీకి బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఇక పవన్‌పైకి బలమైన నేతను బరిలో దింపే ఉద్దేశంలో వైసీపీ(YCP) కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత(Vanga Geetha)కు టిక్కెట్ ఇచ్చింది. ఇదే టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం నేత వర్మ కొంత కినుకు వహించినా చంద్రబాబు(Chandra Babu) బుజ్జగించి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన సద్దుమణిగారు. స్వతంత్రంగా బరిలో ఉంటానంటూ ఆయన చేసిన ప్రకటనలకు చెక్ పెట్టారు. ఇప్పుడు కూటమి వర్సెస్ వైసీపీ మధ్యే ఇక్కడ పోటీ నెలకొంది.
యనమల చాణక్యానికి పరీక్ష
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న మరో కీలక నియోజకవర్గం తుని(Tuni)లో ఈసారి తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య తొలిసారి పోటీపడుతుండగా... వైసీపీ(YCP) నుంచి మంత్రి దాడిశెట్టి రాజా సై అంటున్నారు. యనమల రామకృష్ణుడు తన రాజకీయ చాతుర్యం మొత్తం ఉపయోగించి కుమార్తె విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
హేమాహేమీల పోరు
తూర్పుగోదావరి జిల్లాలో మరో నియోజకవర్గం ఫలితాలపైనా తీవ్ర ఆసక్తి నెలకొంది. అనపర్తి(Anaparthi)లో ఇప్పుటికే సవాళ్లు, ప్రతిసవాళ్లు దాడి... ఏకంగా దేవుడిపై ప్రమాణాలు చేసుకునే వరకు వెళ్లిన సూర్యనారాయణరెడ్డి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మరోసారి పోటీపడుతున్నారు. అలాగే జగ్గంపేట(Jaggampet)లో తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన తోట నరసింహం మరోసారి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగ్గా....జగన్ వెన్నంటే ఉండి అన్నీ తానై పని చేసిన జ్యోతులనెహ్రూ తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఈసారి పోటీపడుతున్నారు.
భరత్ వర్శెస్ వాసు
తూర్పుగోదావరి జిల్లాకే ఆయువుపట్టయిన రాజమండ్రిలో ఈసారి తెలుగుదేశం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి(Adhireddy Vasu)వాసు బరిలో దిగుతున్నారు. ఆర్థిక, అంగ బలమున్న వాసును ఢీకొట్టేందుకు వైసీపీ ఏకంగా సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్(Margani Bharat)ను రంగంలోకి దింపింది. ఇద్దరూ యువనేతలు, మాటకారితనం ఉండటంతో....ఇక్కడి పోటీ ఎంతో ఆసక్తిగా మారింది. ప్రత్యర్ధులు ఇద్దరూ ఎందులోనూ తగ్గేరకం కాకపోవడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గుతారోనని ఆసక్తిగా మారింది.
పీ గన్నవరంపై ఫోకస్
రాజమండ్రి రూరల్‌లో రాజకీయ కురువృద్ధుడు, టీడీపీ ఫైర్‌బ్రాండ్..గోరంట్ల బుచ్చయ్యచౌదరి మరోసారి బరిలో దిగ్గా...ఆయనపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను వైసీపీ ప్రయోగించింది. జగన్ స్వింగ్‌లోనూ వెరవకుండా గట్టిగా నిలబడిన బుచ్చయ్య... ఈసారి ఏమాత్రం పోటీపడతారో చూడాలి. పి.గన్నవరం నుంచి అనూహ్యంగా టిక్కెట్ దక్కించుకున్న మహసేన రాజేశ్‌కు దురదృష్టం వెంటాడుతోంది. గతంలో పవన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు గెలుపుపై ప్రభావం చూపేలా ఉన్నాయి. దీంతో ఆయన స్వచ్ఛందంగానే పోటీ నుంచి విరమించుకుంటానని ప్రకటించారు. ఇక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆసక్తి మాత్రం పోలేదు.
సామాన్య కార్యకర్త జయిస్తారా?
ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా...కేవలం వైసీపీ దాడులను ఎదురొడ్డి నిలిచిన ఓ సామాన్య గిరిజన మహిళకు రంపచోడవం టిక్కెట్ ఇచ్చి అందరినీ ఆశ్యర్యపరిచారు చంద్రబాబు. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం అనంతగిరిలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న శిరీష(Sirisha) భర్త రంపచోడవరం తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే వైసీపీ నాయకులు శిరీష ఫొటో మార్ఫింగ్ చేసి...ఆమె అంగన్‌వాడీ విధులు హాజరవ్వకుండా భర్తతో పాటు తెలుగుదేశం(Telugudesam) పార్టీలో తిరుగుతోందంటూ సోషల్‌మీడియాలో రాద్ధాంతం చేశారు. దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగానే పోరాడారు. అన్ని ఆధారాలతో ఆమె ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అప్పటికీ సోషల్‌మీడియాలో వైసీపీ దాడి తగ్గకపోగా..మరింత పెరిగిపోవడంతో ఆమె బాధతో తాను 8 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఆమె పోరాటాన్నిగుర్తించిన చంద్రబాబు ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఆమెపై సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మీ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు.
పశ్చిమ గాలి ఎటు వీస్తోందో..
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి ఎన్నికల్లో విచిత్రం చోటుచేసుకుంటుంది. ఒక కుటంబంలో అందరూ కూడబలుక్కుని ఓట్లు వేసినట్లు....జిల్లాలో ఓటర్లు మొత్తం ఒకే పార్టికి ఓట్లు వేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈసారి జనసేన అభ్యర్థులు ఎక్కువగా పోటీపడుతుండటంతో విజయలక్ష్మీ ఎవరిని వరిస్తుందో చూడాలి.
పాలకొల్లు(Palakollu)లో మరోసారి తెలుగుదేశం నుంచి సీనియర్ నేత నిమ్మలరామానాయుడు(Nimmala Ramanaidu) పోటీ చేస్తుండగా వైసీపీ శ్రీహరి గోపాలరావుకు టిక్కెట్ కేటాయించింది. సర్దుబాటులో భాగంగా జనసేన నేత కందుల దుర్గేశ్‌కు నిడదవోలు టిక్కెట్ కేటాయించారు. ఆయన రాజమండ్రి రూరల్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ససేమిరా అనడంతో ఆయన్ని నిడదవోలుకు మార్చడం జరిగింది. వైసీపీ గెడ్డం శ్రీనివాస్‌నాయుడిని బరిలోకి దింపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూసే ఫలితం దెందులూరు. తెలుగుదేశం ఫైర్‌బ్రాండ్ చింతమనేని ప్రభాకర్(Chinthamaneni Prabhakar) చివరి నిమిషంలో సీటు దక్కించుకుని బరిలో నిలిచారు. ఆయనపై గత ఎన్నికల్లో పోటీ చేసిన గెలుపొందిన అబ్బయ్యచౌదరినే మరోసారి వైసీపీ పోటీలో నిలబెట్టింది. గోపాలపురంలో హోంమంత్రి తానేటి వనిత పోటీ చేస్తుండగా...ఆమెపై తెలుగుదేశం కొత్త అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజును నిలబెట్టింది. నరసాపురం, భీమవరం నుంచి బొమ్మిడి నాయకర్, పులవర్తి రామాంజనేయులు జనసేన అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు..