General Election Effect: దేశవ్యాప్తంగా హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్ భారీగా వసూలు చేస్తున్న కంపెనీలు
General Elections 20241: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సంరంభం ప్రారంభమైంది. పార్లమెంటు సహా.. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో హెలికాప్టర్లకు భారీ డిమాండ్ పెరిగింది.
General Election Effect: దేశం(India)లో 543 పార్లమెంటు(Parliament) స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. వీటితోపాటు.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఒడిశా(Odisha), సిక్కిం(Sikkim), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే..ఈ సారి పోటీ తీవ్రంగా ఉండనుంది. పార్లమెంటు సహా అసెంబ్లీల ఎన్నికలను కూడా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో విస్తృత స్థాయిలో ప్రచారానికి(Campaign) శ్రీకారం చుట్టాయి. పైగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఇక, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో జరగనున్నాయి. గతానికి భిన్నంగా షెడ్యూల్‌కు పోలింగ్‌కు మధ్య వ్యవధి ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని, ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రాలను చుట్టేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా మెజారిటీ పార్టీల నాయకులు.. హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా జాతీయ పార్టీలైతే.. దేశవ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీల కీలక నేతలు ప్రైవేటు విమానాలను కూడా వినియోగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
హెలికాప్టర్లే ఎందుకు?
వచ్చే ఎన్నికల్లో మూడోసారి(Third time) వరుసగా అధికారం దక్కించుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) ప్రయత్నిస్తుండగా.. ఆ సారైనా గెలుపుగుర్రం ఎక్కి.. పార్టీని నిలబెట్టుకునే వ్యూహంతో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసేందుకు తమకు వీలుగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలా హెలికాప్టర్లను, విమానాలను వినియోగించకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారిపార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ప్రచారాన్ని కూడా అదేస్థాయిలో నిర్వహించాలని నాయకులు భావిస్తున్నారు. ఫలితంగా చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్ 40 శాతం ఎక్కువగా ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకు మరింత ఎక్కువగా డిమాండ్ ఉంటుందంటున్నారు. ప్రాంతీయ పార్టీలు హెలికాప్టర్లవైపు మొగ్గు చూపుతున్నాయి. తక్కువ సమయంలో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లగలిగే సౌలభ్యం ఉన్నందున ప్రాంతీయ రాజకీయ పార్టీలు హెలికాప్టర్ల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతాయి. ఇక, లోక్‌సభ(Lok Sabha) ఎన్నికలకు సంబంధించి జాతీయ రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో చార్టర్డ్ విమానాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో విమానాలు, హెలికాప్టర్లను సంబంధిత సంస్థల నుంచి రోజుల ప్రాతిపదికన, వారాల ప్రాతిపదికన కూడా అద్దెకు తీసుకుంటారు.
భారీ అద్దెలు
సాధారణంగానే విమానాలు, హెలికాప్టర్ల(Helicopter)కు గంటల చొప్పున అద్దె వసూలు చేస్తారు. సాధారణ రోజుల్లోనే ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక, ఎన్నికల సమయంలో డిమాండ్ పెరగడంతో ఆ డిమాండ్‌ను కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. చార్టర్డ్ విమానాలకు గంటకు 4 లక్షల 5 వేల నుంచి 5 లక్షల 25 వేల రూపాయల వరకు అద్దెను డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న లెక్క. ఎన్నికలకు పది పదిహేను రోజుల ముందు ఇది మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. హెలికాప్టర్లకు గంటకు లక్షా 50 వేల రూపాయల వరకు ప్రస్తుతంవసూలు చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో 2 లక్షల వరకు చేరినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ.. హెలికాప్టర్లకు మరింత డిమాండ్ పెరిగితే.. ఇది అద్దెలపై ప్రభావం చూపనుంది. ఆ సమయంలో అద్దె గంటకు 3 లక్షల 50 వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది.
అన్నీ ప్రైవేటువే!
గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు 30 నుంచి 40 శాతం డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీల మధ్య పోటీ.. రాజకీయాల్లో ఉన్న నేతల ఆర్థిక శక్తి పెరగడం దీనికి కారణంగా కనిపిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 2023 డిసెంబరు నాటికి దేశంలో 112 నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్స్ ఉన్నారన్నారు. వీరిలో 40-50 శాతం ఆపరేటర్లు కేవలం ఒక్క విమానమే నడుపుతున్నారు. వీరికి విమానాలు, హెలికాప్టర్లు కలిపి మొత్తం 450 వరకు ఉంటాయని తెలుస్తోంది. డీజీసీఏ సమాచారం మేరకు ఈ ఆపరేటర్ల దగ్గర ఫాల్కన్ 2000, బాంబార్డియర్ గ్లోబల్ 5000, ట్విన్ అట్టర్ డీహెచ్‌సీ-6-300, హాకర్ బీచ్‌క్రప్ఠ్, గల్ఫ్‌స్ట్రీమ్ జీ-200, సెస్నా సైటేషన్ 560 ఎక్స్‌ఎల్, తదితర విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి.
టార్గెట్ ఇదే..
పార్టీల నేతలు హెలికాప్టర్లకు ఎక్కువగా మొగ్గు చూపడానికి ఎక్కువగా చిన్న పట్టణాలకు త్వరగా చేరుకునే అవకాశం ఉండడం.. పార్టీ బలంగా ఉందనే సంకేతాలు పంపించేందుకు ఉపయోగపడుతున్నాయి. దీంతో అద్దె ఎంతైనా హెలికాప్టర్లనే ఎక్కువగా కోరుకునే నాయకులు పెరుగుతున్నారు. కొందరు నేతలు రికార్డు స్థాయిలో హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నారు. 2019-20 సంవత్సరానికి గాను విమానం, హెలికాప్టర్ల ప్రయాణాలకు బీజేపీ రూ.250 కోట్లు వెచ్చించింది. ఇదేసమయంలో కాంగ్రెస్ పార్టీ రూ.126 కోట్లు కేవలం విమానాలు, హెలికాప్టర్లకు ఖర్చు చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో ఇది ఆయా పార్టీలకు డబుల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చిత్రం ఏంటంటే.. అభ్యర్థుల ప్రయాణ ఖర్చు ఎన్నికల ఖర్చులోకి రాదు. కేవలం ప్రచార ఖర్చు అంటే.. జెండాలు, ఇతరత్రా ప్రచారానికి చేసిన ఖర్చునే ఎన్నికల సంఘం పరిగణిస్తుంది. దీంతో వాహనాలకు ఇంత పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారనే వాదన కూడా ఉంది.
ఏపీలో డిమాండ్ ఇదీ..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకే విడతలో జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీ(YSRCP), ప్రధాన ప్రతిపక్షం టీడీపీ(TDP), జనసేన(Janasena)లు హెలికాప్టర్లు వినియోగించనున్నాయి. వైఎస్సార్ సీపీ ఇప్పటికే రెండు హెలికాప్టర్లకు అడ్వాన్స్‌లు ఇచ్చి.. రిజర్వ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు వేర్వేరుగా ఒక్కొక్కటి చొప్పున హెలికాప్టర్లను వినియోగించనున్నారు.