Gajapathinagaram Assembly Constituency : గజపతినగరం గడ్డ.. ఎవరి అడ్డాగా మారేనో..? ఇరు పార్టీలకు అత్యంత కీలకం
Gajapathinagaram Assembly Constituency : విజయనగరంలోని మరో కీలక నియోజకవర్గం గజపతినగరం. 15 సార్లు ఎన్నికలు జరగ్గా, ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు.
Gajapathinagaram Assembly Constituency : విజయనగర జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం గజపతినగరం. ఈ జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంగా దీనికి గుర్తింపు ఉంది. అటువంటి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా, ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ, ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గడిచిన నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవగా, ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను కూడా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం పోరాడుతున్నాయి.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల తీరు
గజపతినగరంలో తొలిసారిగా 1955లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో రెండు స్థానాలకు ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఈ రెండు స్థానాల్లోనూ పీఎస్పీ నుంచి పోటీ చేసిన జి సూర్యనారాయణ గెలవగా, ద్విసభకు పోటీ చేసిన కుసుమా గజపతిరాజు విజయం సాధించారు. జి సూర్యనారాయణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జి అయ్యప్పస్వామిపై 30,584 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ద్విసభకు పోటీ చేసిన కుసుమా గజపతిరాజు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి వెంకటరావుపై 36,366 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1959లో జరిగిన రెండో ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఏటీఎస్ నాయుడు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి సీఎస్‌ఏ నాయుడిపై 25,054 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీఎస్ నాయుడు తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎస్‌జే నాయుడిపై విజయం సాధించారు.
1967లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పి సాంబశివరాజు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీఎస్ నాయుడిపై 15,155 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి సాంబశివరాజు మరోసారి విజయం దక్కించుకున్నారు. ఏకగ్రీవంగా ఈయన ఎన్నికయ్యారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన వీఎన్‌ఏ నాయుడు తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బి గంగరాజుపై 3146 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన జేఎస్ రాజు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీఎస్‌ఏ నాయుడిపై 186 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వీఎన్‌ఏ నాయుడి ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి జేఎస్‌రాజుపై 1859 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పడాల అరుణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన టీఎస్‌ఏ నాయుడిపై 7586 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో పడాల అరుణ మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టి సన్యాసినాయుడిపై 6819 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీఎస్‌ఏ నాయుడు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన జి రామచంద్రరరావుపై 4947 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పడాల అరుణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వీఎన్‌ఏ నాయుడిపై 10,362 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొత్స అప్పలనర్సయ్య తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన పడాల అరుణపై 27,674 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె అప్పలనాయుడు తన సమీప ప్రత్యర్థిక వైసీపీ నుంచి పోటీ చేసిన కె శ్రీనివాసరావుపై 19,423 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బొత్స అప్పలనర్సయ్య మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన కేఏ నాయుడిపై 27,001 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
భారీగానే ఓటర్లు
ఈ నియోజకవర్గంలో 2,04,181 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,02,524 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,01,648 మంది ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ మధ్య పోటీ ఉండనుంది. వైసీపీ నుంచి బొత్స అప్పలనర్సయ్య మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నుంచి కేఏ నాయుడితోపాటు మరికొంత మంది పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఈ నియోజకవర్గంలో హోరాహోరీగా సాగే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.