యాక్టివ్ రాజకీయాల్లోకి మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప.. కాంగ్రెస్ లో చేరిక..!
Andhra Pradesh Politics: పదేళ్ల తర్వాత యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోలె ముత్యాలపాప సిద్ధపడుతున్నారు. జిల్లా పర్యటనకు రానున్న షర్మిల సమక్షంలో చేరనున్నారు.
Former MLA Mutyalapapa Joins To Congress : పదేళ్ల తర్వాత యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప సిద్ధపడుతున్నారు. రెండు రోజుల్లో ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు రానున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల సమక్షంలో చేరనున్నారు. నర్సీపట్నంలో షర్మిల రచ్చబండ కార్యక్రమం తరువాత కాంగ్రెస్ లో తిరిగి చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2009లో బోళెం ఫ్యామిలీని పిలిచి మరీ నర్సీపట్నం అసెంబ్లీ స్థానాన్ని నాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కేటాయించారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ముత్యాల పాప కుటుంబం ఆ తరువాత జరిగిన పరిణామాలతో 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినప్పటికీ ఆమెకు సముచిత స్థానం గౌరవం ఇవ్వకపోవడంతో.. పార్టీ పట్ల అంటీ ముట్టనట్టుగానే ఆమె వ్యవహరిస్తూ వస్తున్నారు. గడిచిన 10 ఏళ్ల నుంచి ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ.. పార్టీ ఆమె సేవలను పెద్దగా వినియోగించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లడం మంచిదని భావించిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ లో చేరనున్న ముత్యాల పాప
రాజకీయంగా గుర్తింపునిచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముత్యాల పాప కుటుంబం రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తనయ వైఎస్ షర్మిల మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ముత్యాల పాప కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. నర్సీపట్నంలో కీలకంగా వ్యవహరించే కొంతమంది నేతల సహాయంతోనే ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. తనతో పాటు భారీ ఎత్తున అనుచరులతో పార్టీలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
నర్సీపట్నంలో తప్పని త్రిముఖపోటీ...
మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప కాంగ్రెస్ పార్టీలో చేరితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీన నర్సీపట్నం వస్తున్న పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ముత్యాల పాపా చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి తన రాజకీయ కార్యక్రమాలను విస్తరించినట్లు చెబుతున్నారు. సౌమ్యురాలుగా పేరు ఉన్న ఆమెకు స్థానికంగా రాజకీయాలను శాసించే కొంతమంది నేతల సహకారం కూడా ఉందని చెబుతున్నారు. వారు పూర్తిస్థాయిలో ఈమెకు సహకారాన్ని అందిస్తే వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈమె బరిలో ఉండే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అదే జరిగితే నర్సీపట్నంలో త్రిముఖ పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడుని ఈమె ఢీకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే ముత్యాల పాప కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉండేందుకు స్థానిక వైసీపీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. అవి ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి.