Election Nominations 2024: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ - తొలిరోజు కీలక నేతల నామినేషన్లు
Andhrapredesh News: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పలువురు నేతలు ఆర్వో కేంద్రాల్లో తమ నామినేషన్లను సమర్పించారు.
Nominations Started In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియకు కీలక ఘట్టం మొదలైంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ (Election Nominations) ప్రారంభమైంది. ఏపీలో (Ap) 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణ 17 ఎంపీ స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలి రోజు ఆర్వో కేంద్రాల్లో పలువురు కీలక నేతలు రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 25వ తేదీ వరకు స్వీకరించిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. 26 వరకు వాటిని స్క్రూట్నీ చేస్తారు. ఇంతలో ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు. ఆ లోపు నామినేషన్లు వెనక్కి తీసుకోవచ్చు. అనంతరం ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. అనంతరం మే 13న పోలింగ్ నిర్వహించి.. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.
భారీ ర్యాలీగా
వివిధ పార్టీలకు చెందిన నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకోగా అక్కడ సందడి నెలకొంది. ఏపీలోని ఒంగోలు లోక్ సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ వేశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకున్న ఆయన.. కలెక్టర్ దినేష్ కుమార్ కు మొదటి సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నెల 25న ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే, కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి బీజేపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి నామినేషన్లు వేశారు.
అటు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఎన్నికల అధికారులకు నామినేషన్లు సమర్పించారు. అలాగే, శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు ఆర్వోకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అలాగే, అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ లో రాజంపేట వైసీపీ అభ్యర్థి వెంకట మిథున్ రెడ్డి తరఫున ఆయన తల్లి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి నామినేషన్ ను లోలుగు వెంకట రాజశేఖర్ దాఖలు చేశారు.
తెలంగాణలో..
అటు, తెలంగాణలో మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, నల్గొండ బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, భువనగిరి ఎంపీ స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ వేశారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కూడా మొదటి సెట్ నామినేషన్ వేశారు. అలాగే, జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరఫున కాంగ్రెస్ నాయకులు మొదటి సెట్ నామినేషన్ వేశారు. ఈ నెల 24న సురేష్ షెట్కార్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.
Also Read: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల