Andhra Elections: పెందుర్తిలో జనసేన పోటీ చేసేనా, టీడీపీకి దక్కేనా ?
Janasena or tdp contest in pendurthi : జనసేన, తెలుగుదేశం పార్టీలో పెందుర్తి అసెంబ్లీ సీటుకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు పార్టీల నుంచి బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు పోటీపడుతున్నారు.
AP Elections 2024 Pendurthi : ఉమ్మడి విశాఖ జిల్లాలోని కొన్ని సీట్లపై తెలుగుదేశం, జనసేన మధ్య పీటముడి తెగడం లేదు. తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలు ఉన్న నియోజకవర్గాలు నుంచి జనసేన సీట్లు కోరుతుండడంతో ఇక్కడి వ్యవహారం కాస్త క్లిష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి, గాజువాక, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాలు నుంచి జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.
గత ఎన్నికల్లో గాజువాక నుంచి స్వయంగా పవన్ కల్యాణ్ పోటీ చేశారు. ఈ నాలుగు స్థానాల్లో ప్రస్తుతం జనసేనకు బలమైన నేతలు ఉండడంతో ఇక్కడ సీట్లు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కానీ, ఈ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేతలు ఉన్నారు. వీరికి ఇవ్వకుండా అక్కడ జనసేనకు ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. దీంతో ఇక్కడి సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇరుపక్షాలకు చెందిన నేతలు తమ తమ స్థాయిల్లో సీట్లు కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. నాలుగు స్థానాల్లో కనీసం రెండు, మూడు స్థానాలను అయినా తీసుకోవాలని జనసేన భావిస్తోంది.
పెందుర్తిలో తీవ్రమైన పోటీ
జనసేన, తెలుగుదేశం పార్టీలో పెందుర్తి అసెంబ్లీ సీటుకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇక్కడి నుంచి ఓటమి చెందారు. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే వారసుడిని బరిలోకి దించాలని ఆయన వ్యూహాలు సిద్ధం చేశారు. అధిష్టానం అందుకు అంగీకరించకపోతే తానే బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ, ఇక్కడ స్థానాన్ని జనసేన కోరుకుంటోంది.
వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించి పవన్ కల్యాణ్ హామీ మేరకు పార్టీలో చేరిన పంచకర్ల రమేష్‌బాబు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. పవన్ కల్యాణ్ సీటు హామీ ఇవ్వడంతోనే ఆయన పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న పోటీతో సీటు ఎవరికి కేటాయించాలో తెలియక అగ్ర నాయకత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.
తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు
సీటు కోసం ఇరువురు నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అల్లుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఈయన బావ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వీరి ద్వారా సీటును పొందేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. అధిష్టానం కూడా సీటు ఖరారు చేస్తుందని పార్టీ శ్రేణులకు ఆయన చెబుతున్నారు. కానీ, మరో పక్క రమేష్‌బాబు కూడా అంతేస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు.
రెండు రోజులు కిందట విశాఖకు వచ్చిన నాగబాబును కలిసిన ఆయన.. సీటు గురించి చర్చించినట్టు చెబుతున్నారు. పని చేసుకుంటూ వెళ్లాలని నాగబాబు రమేష్‌బాబుకు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలోనే ఏళ్ల తరబడి ఉంటూ వస్తున్న సీనియర్ నేతకు కాదనలేని పరిస్థితి టీడీపీది. బలమైన నేతల్లో ఒకరిగా, గెలిచేందుకు అవకాశం ఉన్న సీటుగా భావిస్తున్నది కావడంతో వదులుకోలేని స్థితిలో జనసేన ఉంది. చివరికి ఎవరికి అధిష్టానం సీటు కేటాయిస్తుందో మరో రెండు, మూడు రోజుల్లో తేలనుంది.