Dokka Resign To YSRCP : వైసీపీకి మరో దళిత నేత రాజీనామా - పార్టీకి, పదవులకు డొక్కా మాణిక్య వరప్రసాద్ గుడ్ బై
Andhra Politcs : డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా వైసీపీలో ప్రాధాన్యం దక్కకపోగా అవమానాలు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Dokka Manikya Varaprasad resigned from YCP : ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి దళిత నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు.
వైసీపీలో ప్రాధాన్యం దక్కని డొక్కా
గుంటూరు వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహిస్తున్న మాజీ మంత్రి డొక్కా మానిక్యవరప్రసాద్‌కు ఆ పార్టీలో గుర్తింపు లేదు. కనీసం ఎవరూ ప్రచారానికి కూడా పిలవడం లేదు. కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్టీలో తన పరిస్థితిపై తానే బాధపడ్డారు. తనకు న్యాయం జరగడం లేదని.. ఒక్క సారి జగన్‌ను కలిపించాలని ఆయన వేదికపై ఉన్న నేతల్ని వేడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయనను మరింతగా దూరం పెట్టారు. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా కనీసం పార్టీ కార్యక్రమాలపైనా సమాచారం ఇవ్వడం లేదు.
సీనియర్ దళిత నేతగా గుర్తింపు
2004లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన తాడికండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. మంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన విభజన అనంతర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డొక్కా వరప్రసాద్ ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లు సమయంలో ఆయన పార్టీ కండువా మార్చి వైసీపీలో చేరిపోయారు. అప్పుడే టీడీపీ తరపు ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైసీపీ తరపున తాను ఖాళీ చేసిన స్థానంలోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఏ పార్టీలో చేరుతారో ?
2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశపడిన డొక్కాకు నిరాశే ఎదురైంది. దీంతో పార్టీ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాజకీయాల్లో కీలకంగా మెలిగిన డొక్కా.. ఇప్పుడు సీటు దక్కకపోగా పార్టీలోనూ ప్రాధాన్యత లోపిస్తుండటంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని వాదన వినిపిస్తోంది. డొక్కాను వదులుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీపై అది ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత రాజీనామా చేయడంతో.. డొక్కా ఏ పార్టీకి ప్రచారం చేస్తారన్న దానిపై ఆసక్తి ఏర్పడింది.